Jun 02,2022 06:31

అత్తింటి వేధింపులు తాళలేని 28 ఏళ్ల శ్రుతి తన రెండేళ్ల కొడుకును తీసుకుని, భుజాన సంచి తగిలించుకుని చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. ఆ సమయానికి సరిగ్గా సాయంత్రం 5 గంటలు కావస్తోంది. మధ్యప్రదేశ్‌ చింద్వారా జిల్లా చాంద్‌ ప్రాంతమది. అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని ఆదివాసీ జనాభా అధికంగా నివసించే మండ్ల జిల్లా హృదయనగర్‌కు చేరుకోవాలన్న ఆతృతతో వడివడిగా అడుగులు వేస్తూ బస్టాండ్‌కు చేరుకుంది. కాని అప్పటికే చివరి బస్సు వెళ్లిపోయింది. అప్పుడే అక్కడికి బబ్లు వచ్చాడు. బస్టాప్‌లో ఒంటరిగా బిడ్డతో దిగాలుగా కూర్చొన్న శృతిని చూశాడు. తనను తాను పరిచయం చేసుకుని తెల్లారి మొదటి బస్సు వచ్చేవరకు తన ఇంట్లో ఆశ్రయం పొందాలని ఆమెను కోరాడు. ఆ రాత్రి ఆమెకు కాళరాత్రి. ఆ అపరిచితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. తనపై జరిగిన అకృత్యం నుంచి తేరుకోకముందే మరుసటి రోజే రాజస్థాన్‌ భిల్వారాకు చెందిన వ్యక్తికి రూ.1.70 లక్షలకు అమ్మేశాడు. అతను కొట్టి తిట్టి శృతిని తనతో తీసుకెళ్లిపోయాడు. మరి బిడ్డ ఏమయ్యాడు? నగర శివార్లలో అనాథగా మిగిలిపోయాడు.
అత్తింటివారు పోలీసులకు ఫిర్యాదు చేసినా శృతి జాడ తెలియలేదు. కొన్ని వారాలకు శృతి రాజస్థాన్‌ లోని పాలి జిల్లా గుర్జార్‌కి రెండోసారి అమ్ముడయ్యింది. నెలల తరబడి అతను హింసించాడు. అనేకసార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. ఎట్టకేలకు భిల్వారా వన్‌ స్టాప్‌ సెంటర్‌ చొరవతో శృతి ఆ చెర నుంచి తప్పించుకోగలిగింది. హింసకు గురవుతున్న మహిళల సంరక్షణ కోసం ఆ సెంటర్‌ పని చేస్తుంది. ఇదంతా 2019లో జరిగింది.
2021 మధ్యప్రదేశ్‌ పోలీసు విభాగం 'మిస్సింగ్‌' కేసుల స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. అందులో భాగంగా భిల్వాలో తలదాచుకుంటున్న శృతి ఆచూకి ఆమె వాళ్లకు తెలిసింది. ఇప్పుడు కూడా ఆ పసివాడి జాడ తెలియలేదు. అతని పాత ఫొటోలు చూపించి గాలించారు. చిట్టచివరికి చింద్వారా వసతి గృహంలో అతని సమాచారం దొరికింది.
శృతి మాదిరే 24 ఏళ్ల కుష్బు భోపాల్‌ నుంచి రాజస్థాన్‌కు అక్రమ రవాణా చేయబడింది. ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ పెట్టిన వంట మేస్త్రీ మాటలు నమ్మింది కుష్బు. అలా 2021 అక్టోబరు 1న రూ.80 వేలకు మోర్‌ సింగ్‌ వద్దకు 'అద్దెకు' వెళ్లింది. అక్కడ మోర్‌, అతని కొడుకు ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేశారు. చీకటి గదిలో బంధించారు. అయితే పోలీసుల చొరవతో రెండు నెలల్లోనే ఆమె రక్షించబడింది.
2021 ఏడాదే శృతి, కుష్బు లాంటి 10,648 మంది మహిళలు ఆ రాష్ట్ర మిస్సింగ్‌ జాబితాలో ఉన్నారు. వారంతా 12 నుంచి 30 ఏళ్ల మధ్య వారే. మొత్తం సంఖ్యలో 8,876 మంది అమ్మాయిలు, 1,772 మంది అబ్బాయిలు ఉన్నారు. విచారించాల్సిన అంశం ఏమంటే అక్కడ రోజుకు సరాసరి 29 మంది అపహరణకు గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) లెక్కల ప్రకారం 2020లో మధ్యప్రదేశ్‌లో 8,751 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక మంది బాధితులు ఇండోర్‌, భోపాల్‌, ధార్‌, జబల్‌పూర్‌, రేవాల నుంచి ఉన్నట్లు తేలింది. సెక్స్‌ ట్రాఫికింగ్‌, నిర్బంధ పని, గృహ హింస వంటివి అపహరణకు గల కారణాలని నివేదిక తేల్చిచెప్పింది.
మే 25న 'అంతర్జాతీయ మిస్సింగ్‌ చిల్డ్రన్స్‌ డే' సందర్భంగా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెలుగు చూశాయి. రోజుకు మధ్యప్రదేశ్‌లో సరాసరి 29 మంది, రాజస్థాన్‌లో 14 మంది, ఢిల్లీ, హర్యానాలో ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌లో 8 మంది చొప్పున అపహరణకు గురవుతున్నారు. నమోదవుతున్న కేసుల్లో 60 శాతమే పరిష్కారమవ్వడం ఆందోళన కలిగించే అంశమని మాతా శిశు అభివృద్ధి విభాగ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.ఎన్‌ కన్‌సోటియా విచారం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది సిఆర్‌వై 'కోవిడ్‌ అండ్‌ మిస్సింగ్‌ చైల్డ్‌హుడ్‌' పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీలో 2020 జనవరి-జులై మధ్య కాలంలో 9,453 మంది చిన్నారులు అపహరణకు గురయ్యారు. మాస్క్‌ ధరించడం తప్పనిసరైన ఆ పరిస్థితుల్లో బాధితులను ట్రేస్‌ చెయ్యడం, నిందితులను గుర్తించడం పెద్ద సవాలుగా తయారైందంటున్నారు సిఆర్‌వై స్వచ్ఛంద సంస్థ (చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యు) ప్రాంతీయ డైరెక్టర్‌ సోహా మోయిత్రా.
ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం మిస్సింగ్‌ కేసుల్లో అత్యధికంగా ఉన్న బాలికల శాతం లాక్‌డౌన్‌ కాలంలో మరింత పెరిగింది. గతంలో 2016లో మొత్తం కేసుల్లో 65 శాతం ఉంటే 2020లో ఆ సంఖ్య 77 శాతానికి పెరిగింది. కోవిడ్‌ తెచ్చిన విపరీత పరిణామాల్లో ఇదొకటని తేలిగ్గా తీసుకోకుండా...అపహరణకు గురైనవారిని సత్వరమే గుర్తించాలి. వారికి రక్షణ కల్పించడమే కర్తవ్యంగా విధివిధానాలు అమలు చేయాలి.

/ ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ /