గత 18 నెలలుగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదరు చూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను జూన్ 18న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులలో తీవ్రమైన నిరాశ, ఆందోళన వ్యక్తమౌతున్నది. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ లేదని నిరుద్యోగ అభ్యుర్థులు విమర్శిస్తున్నారు.
విభజన తర్వాత భారీ నిరుద్యోగం
రాష్ట్ర విభజన (2014) తరువాత ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం భారీగా పెరిగింది. విభజన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ప్రైవేట్ రంగంలోనైనా కొన్ని పరిశ్రమలు వచ్చేవి. పైగా...రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పారిశ్రామికీకరణ లేక, ఐ.టి పరిశ్రమలు లేక...లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. విభజన నాటికి రాష్ట్రంలో 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని ప్రకటించారు. గత 7 సంవత్సరాలుగా వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు. కానీ ఉద్యోగాల భర్తీ మాత్రం జరగలేదు. ఉదాహర ణకు 2014-21 మధ్య ఏడేళ్ళ కాలంలో ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తి చేసే డిఎస్‌సి-2018లో 7 వేల పోస్టులతో ఒకసారి మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
జాబ్ క్యాలెండర్ పోస్టులు
వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా 10,143 పోస్టులు భర్తీ చేస్తామనిముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించి, వాటి వివరాలు వెల్లడించారు. బ్యాక్‌లాగ్ వేకెన్సీలు-1238, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు-36, పోలీస్-450, వైద్యశాఖ-డాక్టర్లు, ప్రోఫెసర్లు-451, వైద్యశాఖ- పారామెడికల్ సిబ్బంది-5251, వైద్య శాఖ నర్సులు-441, డిగ్రీ లెక్చరర్లు-240, యూనివర్సిటీ అధ్యాపకులు-2000, ఇతరులు-36, మొత్తం పోస్టులు-10,143.
నిరుద్యోగుల అసంతృప్తి
జాబ్ క్యాలెండర్ తరువాత నిరుద్యోగులు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. జాబ్ క్యాలెండర్ 10,143 పోస్టులలో 76 శాతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధిం చినవే. వైద్య ఆరోగ్యశాఖలో కూడా నర్సుల పోస్టులు భర్తీ కావాలి. 441కే పరిమితం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో వైద్య, ఆరోగ్య శాఖలో వీలైనన్ని ఎక్కువ పోస్టులు భర్తీ చేయవ లసిన అవసరమున్నది. కాని అదే సమయంలో ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ ఉద్యోగాలు, గ్రూప్1, 2 ఉద్యోగాలు, గ్రంథాలయ పోస్టులు, జూనియర్ లెక్చరర్లు, ఇంజనీరింగ్ అభ్యర్థులకు సంబంధించిన ఉద్యో గాల ప్రస్తావన జాబ్ క్యాలెండర్‌లో లేకపోవటంతో నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన ప్రారంభించారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో వేలాది మంది పేద, గ్రామీణ అభ్యర్థులు గ్రూప్2, పోలీస్ ఉద్యోగాలకు హైదరా బాద్, కాకినాడ, కర్నూలు, విజయనగరం, విజయవాడ, అవనిగడ్డ మొదలగు చోట్ల కోచింగ్ తీసుకుంటూ వేలాది రూపాయలు ఖర్చు చేశారు. నిరుద్యోగుల అంచనా ప్రకారం తొలి దశలో కనీసం 50 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదలవుతుందని భావించారు.
నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్‌లో డిమాండ్ చేస్తున్న పోస్టులు....డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు-25000, పోలీస్ కానిస్టేబుళ్లు-6000, పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు-1000, వివిధ శాఖలతో గ్రూప్ 2 పోస్టులు-2000, గ్రూప్ 1 పోస్టులు-300, జూనియర్ లెక్చరర్లు-1000, గ్రంథాలయ ఉద్యోగులు-2000, ఇంజనీరింగ్ ఉద్యోగులు-2000. విద్యా శాఖలో 14 వేలకు పైగా సెకండరీ గ్రేడ్ పోస్టులు ఖాళీగా వున్నాయని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. వీటితోపాటు స్కూల్ అసిస్టెంట్లు, మోడల్ స్కూళ్లు, సోషల్ వెల్‌ఫేర్ స్కూళ్లలో ఖాళీలు మొత్తం కలిపితే 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులున్నాయి. పోలీసు శాఖలో 14 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని, తొలి దశలో 6 వేల పోస్టులు భర్తీ చేస్తామని హోంశాఖ మంత్రి పదే పదే ప్రకటించారు. దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 2 ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్నారు. తీరా 36 పోస్టులు ఉన్నాయని ప్రకటించటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. వీటి సంఖ్యను 2 వేలకు పెంచాలి. వాటితోపాటు ఇరిగేషన్, ట్రాన్స్‌కో, జెన్‌కో మొదలైన వాటిలో గత 6 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ జరగలేదు. నిరుద్యోగులుగా వున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నది. గత 15 ఏళ్ళుగా గ్రంథాలయాలలో పోస్టుల భర్తీ జరగలేదు. వేలాదిమంది నిరుద్యోగ అభ్యుర్ధులు గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌పై పునరాలోచన చేయవలసిన అవసరం వున్నది. ఇప్పటికే ప్రకటించిన 10,143 పోస్టులతో పాటు అనుబంధ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి పోస్టుల సంఖ్యను ఈ ఆర్థిక సంవత్సరానికి 50 వేలకు పెంచాలని అభ్యర్ధులు కోరుతున్నారు. టెట్ సిలబస్‌ను ఇటీవల విడుదల చేసిన దృష్ట్యా, 25 వేల ఉపాధ్యాయ పోస్టులతో టెట్, డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్ధులు కోరుతున్నారు.
ప్రభుత్వాల బాధ్యతలు, విధులలో...ఉపాధి, ఉద్యోగ కల్పన కూడా ఒక ముఖ్యమైన అంశమనే విషయాన్ని మరచి పోకూడదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి అనుబంధ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలి.
/ వ్యాసకర్త శాసనమండలి సభ్యులు, సెల్ : 94402 62072 /










