ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : ఈనెల 21న జరగబోయే జాబ్ మేళాను నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య శిక్షణ అభివద్ధి సంస్థ జిల్లా మేనేజర్ ఉరిటి సాయికుమార్‌తో కలిసి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువు పూర్తి చేసిన యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించేందుకు అవసరమైన శిక్షణను అందజేయడమే కాకుండా వారికి మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. బహుళ జాతి కంపెనీలతో పాటు రాష్ట్రానికి చెందిన పలు కంపెనీలతో మాట్లాడి ప్రతి జిల్లా పరిధిలో ఉద్యోగ మేళా నిర్వహించి స్థానికంగా గల యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. కావున ఈనెల 21న జరగనున్న జాబ్ మేళాలో జిల్లాతో పాటు నియోజకవర్గ పరిధిలో గల యువత పాల్గొని జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బి రమేష్, పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










