Sep 04,2023 00:21

స్థానిక గిరిజనులతో మాట్లాడుతున్న అప్పలనరస

ప్రజాశక్తి- యంత్రాంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో సిపిఎం సమర భేరి చేపట్టారు. సిపిఎం నేతలు ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను వివరించారు.
అరకులోయ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా అరకులోయ మండలం చినలబుడు గ్రామ పంచాయతీ కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పల నర్స మాట్లాడుతూ, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చి నిరుద్యోగులకు మోసం చేసిందన్నారు. 9 సంవత్సరాల కాలంలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, కనీసం కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు తొలగించి దేశంలో అచ్చేదిన్‌ కోసం మోడీ ప్రభుత్వం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రతి జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారని సచివాలయ ఉద్యోగాలు మినహా ఏ ఒక్క నోటిఫికేషన్‌ విడుదల చేయలేదన్నారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని, వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో అనేకమంది యువతీ, యువకులు బీఈడీ, డైట్‌, ఇంజనీరింగ్‌, డిగ్రీలు, పీజీలు చదివి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారని తక్షణమే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.
సిపిఎం నాయకులు పి.బాలదేవ్‌ మాట్లాడుతూ, ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో 3 రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో 3 రిజర్వేషన్‌ చట్టబద్ధం చేసి ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేపట్టాలని అప్పలసి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకురాలు లక్కోయి కుమారి, గాసి, గోపి, చిన్నలబుడు గ్రామ యువకులు కె.సిద్ధార్థ నాథ్‌, పి.మోజేష్‌, రాజ్‌ కుమార్‌, సీమోను, అభిషేక్‌ డానియల్‌, ప్రశాంత్‌, అరవింద్‌ పాల్గొన్నారు.
హుకుంపేట: నిరుద్యోగుల సమస్యలపై ఈనెల 4న చేపట్టే నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి వి.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. మండలం కేంద్రంలో సిపిఎం సమరబేరిలో భాగంగా లక్ష్మణరావు మాట్లాడుతూ, నిరుద్యోగ యువతి, యువకులు డిఇడీ, బీఇడ్‌, ఐటిఐ డిప్లామా చదివి ఖాళీగా ఉంటున్నారనానఉ.ఎస్టీ బ్యాక్‌ లాక్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కృష్ణా రావు, టి.అప్పులకొండ పడాల్‌్‌ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం సమరభేరి ప్రచారం
అరకులోయ:సిపిఎం సమరభేరిలో భాగంగా ఆ పార్టీ మండల కార్యదర్శి కే.రామారావు ఆధ్వర్యంలో సుంకరమెట్ట వారపు సంతలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. జీవో 3 చట్టబద్ధత కల్పించాలని, గిరిజన స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ విడుదల చేసి యువతకు ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. తహసిల్దార్‌ కార్యాలయం వద్ద ఈనెల 4న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కూలి పనులు దొరకక ఉపాధి లేక అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఒకపక్క నిత్యావసర ధరలు పెరిగి కొనుక్కోలేని పరిస్థితుల్లో విద్యుత్‌ ఛార్జీలు, పెట్రోల్‌ డీజిల్‌ చార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరుస్తుందన్నారు.ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కే.రామన్న కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, సుంకరమెట్ట సర్పంచ్‌ జి.చిన్న బాబు, నాయకులు పి.నాని బాబు, జి.బుజ్జిబాబు, టీ.జోషి, కే. బుజ్జిబాబు పాల్గొన్నారు.