జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశం
ప్రజాశక్తి - పాడేరు: జాబ్ కార్డు కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికీ ఉపాధి కల్పించాలని, తద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాల్ నుంచి జిల్లాలోని 22 మండలాల ఎంపిడిఒలు, తహశీల్దారులు, ఉపాధి ఎపిఒలు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, డి పట్టాల పంపిణీ, మన బడి నాడు నేడు పనుల పురోగతి, సమగ్ర భూ రీసర్వే, పన్నులు వసూళ్లు, ఆధార్ నవీనీకరణ, సుస్థిరాభివద్ధి లక్ష్యాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెలలో ఉపాధి హామీ పనులను పెద్ద ఎత్తున చేయాలని సూచించారు. జాబ్ కార్డున్న గిరిజన కుటుంబానికి రూ.25 వేల వేతనం అందిలా ఉపాధి పనులు కల్పిస్తే, వచ్చే ఖరీఫ్‌లో వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందన్నారు. గతంలో పనులు జరగని గిరిజన గ్రామాల్లో విధిగా ఉపాధి కల్పించాలని, నూరుశాతం పనులు కల్పించేలా ప్రణాళికా బద్దంగా ముందుగా పనులు కల్పించాలని సూచించారు. ఉపాధి జబ్ కార్డులకు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశించారు.ఉపాధి హామీలో చెరువులు, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం ద్వారా వ్యవసాయ భూములకు సాగునీరందుతుందన్నారు. ఆధార్ కార్డులేని వారికి మొబైల్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధార్ కార్డులు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి పన్నుల వసూళ్లు చేయాలని స్పష్టం చేసారు.
నిధులు దుర్వినియోగం జరిగితే చర్యలు....
మన బడి నాడు నేడు పనుల్లో నాణ్యతలు పాటించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం పనులు పక్కాగా చేయాలని సూచించారు. విద్యుత్తు పరికరాలు, తాగునీటి పైపులు, నిర్మాణ సామగ్రితో నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. నాసిరకం వస్తువులు కొనుగోలు చేసి నిధులు దుర్వినియోగం చేస్తే చట్టపరమైన కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన బడి నాడు నేడులో చేసిన పనులు విద్యార్థులకు ఉపయోగపడేలా నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు.
అర్హులైన గిరిజనులకు డి పట్టాలు
డి. పట్టా భూములను గుర్తించి ఎస్సైన్‌మెంట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి గిరిజన రైతులకు పంపిణీకి తాహశీల్దారులు చొరవ చూపాలని ఆదేశించారు. భూములు సర్వే చేసి సబ్ డివిజన్ చేయాలన్నారు. ఆదాయ, కులధ్రువీకరణల జారీలో జాప్యం వద్దని ఆదేశించారు. సుస్థిరాభివృద్ధి (ఎస్‌డిజి) లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు.
వేసవిలో ఆరోగ్యం జాగ్రత్త.
మండల కేంద్రాలు, పిVచ్‌సిల పరిధిలో వైద్యశిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఈనెల 1న కలెక్టరేట్ వద్ద నిర్వహించిన వైద్యశిబిరంలో 340 మంది ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు మధుమే:, అధికరక్తపోటు వ్యాధితో బాధపడుతున్నారని, వేసవిలో అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. శివశ్రీనివాసు, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాత్సవ, డిఆర్‌ఒ అంబేద్కర్, సర్వే సహాయ సంచాలకులు వై.మోహనరావు, డ్వామా పిడి రమేష్ రామన్, డిపిఒ కొండలరావు, డివిజనల్ పంచాయతీ అధికారి పిఎస్ కుమార్, ఎపిడి జె. గిరిబాబు, పిఎంయు ప్రోగ్రాం అధికారి రాంగోపాల్ పాల్గొన్నారు.










