Aug 01,2021 15:09

న్యూఢిల్లీ : ఆడ పిల్లలు వయసుకు రాగానే పెళ్లిళ్లు చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఆ తరువాత అత్తారింటిలో అన్ని బాధ్యతలూ తీసుకుని కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు. పిల్లలను కని వారి వంశాన్ని వృద్ధి చేస్తారు. అయితే ప్రస్తుత కాలంలో కొందరు పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. పిల్లలను కంటే లావైపోతారని, వారి ఆలనాపాలన చూసుకోవడానికి సమయం సరిపోదని, పురిటినొప్పులను భరించలేమని వంటి కొన్ని సాకులతో పిల్లలను కనేందుకు ఇష్టపడటం లేదు. మరికొందరైతే.. అభివృద్ధి చెందుతున్న సాంతికేకతను ఉపయోగించుకొని 'టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ'లను కంటున్నారు. ఇంకొందరు చట్ట వ్యతిరేకంగా అద్దె గర్భాలను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా, పెళ్లయ్యాక కొందరికి ఏడాదికి పిల్లలు కలిగితే.. మరికొందరికి రెండు లేదా మూడేళ్లకు.. లేదా నాలుగేళ్లకు పిల్లలను కంటారు. కొందరికి వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా అసలు పిల్లలే కలగరు. అయితే, ఓ దంపతులకు పెళ్లయిన తరువాత ఎనిమిదేళ్ల వరకూ పిల్లలు కలగలేదు. ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. అయినా పిల్లలు కలగలేదు. ఇక కలగరని ఆశలు వదులుకున్న ఆ దంపతులు అవధుల్లేని ఆనందానికి లోనయ్యారు. వారి సుదీర్ఘ నిరీక్షణ ఫలించి, ఒకేసారి వారికి నలుగురు సంతానం కలిగారు. వీరిలో ఒకరు అమ్మాయి కాగా, మిగతా ముగ్గురు అబ్బాయిలు.

వివరాల్లోకి వెళితే.. గజియాబాద్‌కు చెందిన దంపతులు సంతానం కోసం ఎందరో వైద్యులను సంప్రదించారు. ఐసియు వంటి సాంకేతికతల సాయంతో వైద్యం పొందారు. ఎనిమిదేళ్లు గడిచినా ఫలితం లేకపోయింది. చివరిగా వారు ఢిల్లీలోని 'సీడ్స్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌' ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ గౌరి అగర్వాల్‌ను సంప్రదించారు. అన్ని వైద్య నివేదికలను పరీక్షించి, ఐవిఎఫ్‌ ద్వారా సంతానం కలిగే అవకాశముందని ఆమె సూచించారు. ఈ విధానంలో వైద్యం అందించడం ద్వారా గృహిణిగా ఉంటున్న ఆ మహిళ (32) గర్భం దాల్చారు. 33 వారాల తర్వాత శనివారం ఆమె నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఒక్కొక్కరూ 1.5 కిలోల బరువు ఉన్నారని డాక్టర్‌ చెప్పారు. ఇప్పుడు ఆ దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు.