ప్రజాశక్తి - నెల్లిమర్ల : స్థానిక ఇవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి శనివారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన గదులను, వాటికి వేసిన సీళ్లను పరిశీలిం చారు. రెండు గోదాముల్లో సిసి కెమేరాలు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని ఆదేశించారు. గోదాముల్లోని అనవసర వస్తువులను తక్షణమే అక్కడి నుంచి తీసివేయాలని సూచించారు. ఖాళీ గదులన్నిటినీ శుభ్రంచేసి, వినియోగానికి సిద్దంగా ఉంచాలని, గోదాములవద్ద భద్రత పటిష్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇవిఎంల తొలిదశ తనిఖీ పరిశీలన
గోదాముల వద్ద జరుగుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తొలిదశ తనిఖీ (ఎఫ్‌ఎల్‌సి) ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఇంజనీర్లు అక్కడి ప్రక్రియను కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలోని సుమారు 5,600 ఇవిఎంలను తనిఖీ ప్రక్రియను ఈ నెల 20న ప్రారంభిం చామని, ఆదివారంతో ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. బిహెచ్‌ఇఎల్‌కు చెందిన ఐదుగురు ఇంజనీర్ల ఆధ్వర్యంలో, శిక్షణ పొందిన సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీలు ఇవిఎంల తనిఖీలు నిర్వహి స్తున్నారు. ఈ తనిఖీల్లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ దేవ్ ప్రసాద్, నెల్లిమర్ల తహశీల్దార్ డి.ధర్మరాజు, డిటి డి. శైలజ, నగర పంచాయతీ కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు, రెవెన్యూ సిబ్బంది, పాల్గొన్నారు.










