కడప : త్వరలో నిర్వహించనున్న ఇవిఎంల ఫస్ట్ లెవెల్ చెక్ (ఎఫ్‌ఎల్‌సి) కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరవ్వాలని కలెక్టర్ వి.విజరు రామరాజు రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ వి. విజరు రామరాజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెసి గణేష్ కుమార్, కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్వో గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎల్ సి ప్రక్రియ విధానంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇవిఎంల పనితీరుకు సంబంధించి ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైన అంశమని, నిర్వహణ సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. అందుకోసమే ఆయా పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరవ్వాలన్నారు. ఎఫ్‌ఎల్‌సికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి షెడ్యూల్ రాగానే రాజకీయ పార్టీలకు సమాచారం అందిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇవిఎంస్టేటస్ విషయానికి వస్తే 6021 (23శాతం) బియూలు, 5501 (12శాతం) సీయూలు, 5952 (12శాతం) వివి ప్యాట్‌లు ఉన్నాయని వాటన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తిగా స్కాన్ చేశామన్నారు. బియు, సియు లకు అన్నింటికీ కూడా యాక్సెప్టెన్సీ టెస్ట్ కూడా పూర్తి చేశామన్నారు. ఇవిఎంల ఎఫ్‌ఎల్ సి తర్వాత రాండమైజేషన్ చేస్తామని, వాటి భద్రత అంశంలో ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల మేరకు రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఆ సందర్భంగా ఇవిఎంలకుసంబంధించి రాజకీయ పార్టీలకు ఏవైనా సాంకేతిక పరమైన సందేహాలు ఉన్నా సంబంధిత బెల్ ఇంజనీరింగ్ అధికారులు నివత్తి చేస్తారన్నారు. ఓటరు జాబితా అంశానికి సంబంధించి రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులను వందశాతం పరిశీలన పూర్తి చేశామన్నారు. ఫామ్ 6, 7, 8 లపై ఏవైనా సమస్యలు ఉంటే తమ దష్టికి తేవాలని చెప్పారు. అక్టోబర్ 27న ఓటరు జాబితా డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.హరి ప్రసాద్ , సగిలి గురప్ప , జి. లక్ష్మణ్ రావు, శశిభూషన్ రెడ్డి ప్రసాద్ గౌడ్ , డా.బి శ్రీనివాసులు మల్లికార్జున జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.










