Apr 02,2023 00:04

చందాలు వసూలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-డుంబ్రిగూడ: మండలంలో ఇటుకల పండగ సందడి నెలకొంది. ఈ పండగను సుమారు వారం రోజులపాటు ప్రాంతాలవారీగా గిరిజనులు జరుపు కుంటారు. ఈ పండుగను పురస్కరించుకొని మండలం లోని గ్రామాల్లో గిరి మహిళలు రోడ్డుకు అడ్డంగా గేట్లు వేసి పజోర్‌ (చందా)వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో మహిళలు బ్యాచులుగా ఏర్పడి గ్రామానికి సమీపంలో ప్రధాన రహదారుల్లో కర్రలతో గేట్లు వేసి పజోర్‌ వసూలు చేస్తారు. ఒకవేళ అటువైపుగా వెళ్లిన వాహనదారులు పజోర్‌ ఇవ్వకపోతే వారిపై సరదాగా పేడ నీళ్లు, రంగు నీళ్లు పోయడం ఆనవాయితీ. సేకరించిన చందా డబ్బులతో మహిళలు సరదాగా పిండి వంటలు చేసుకోవడం లేదా అందరూ కలిసి ఏదో ఒక వస్తువులను కొనుక్కుంటారు. ప్రతి గ్రామంలో గేట్లు వేసి మహిళలు సరదాగా పజోల్‌ వసూలు చేస్తుండటంతో అడుగడుగునా ఇటుకల పండగ సందడి నెలకొంది.