Mar 30,2023 23:45

చందాలు వసూలు చేస్తున యువకులు

ప్రజాశక్తి -అనంతగిరి:ప్రతి ఏడాది సాంప్రదాయ కంగా జరుపుకునే ఇటుకల పండుగ మండలంలో సందడిగా ఆరంభమైంది. ఈనెల 27న కొన్ని ప్రాంతాల్లో పండుగను జరుపుకోగా మరికొన్ని ప్రాంతాలలో 30న పండుగను మొదలుపెట్టారు. ప్రాంతాలను బట్టి వివిధ రూపాలలో పండుగను నిర్వహించుకుంటారు. పండుగ ముందుగానే ఇల్లులకు రంగులు చల్లి ముస్తాబు చేసుకుంటారు. కుటుంబ సభ్యులంతా కొత్త వస్త్రాలు ధరించుకుంటారు. వరి, సామలు వంటి విత్తనాలను వేరు వేరుగా బుట్టలలో పెట్టుకొని ఇంటి మూలన పెట్టుకొంటారు. మూడు లేదా తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ చివరి రోజు గ్రామ శివారులో చక్కుదేవత వద్దకు గ్రామస్తులంతా రాత్రి చేరుకొని విత్తనాలను చక్కు దేవత వద్ద ఆ రాత్రంతా ఉంచుతారు. అనంతరం ఆ విత్తనాలను ప్రతి ఇంటింటికి పంచుకుంటారు. ఈ విత్తనాలతో పాటు ఇంట్లో ఉన్న విత్తనాలు కలిపి పంట పొలాలలో జల్లుకుంటారు.పండుగ సమయంలో దింసా నృత్యాలతో గ్రామాలలో కోలాహలం నెలకొంటుంది. చిన్న పిల్లలు సైతం రంగులు పూసుకుంటారు. అరకు ప్రధాన రహదారిపై టోల్‌ గేట్లు ఏర్పాటు చేసుకుని వాహనదారుల నుండి చందా వసూలు చేస్తారు. వచ్చిన మొత్తం డబ్బులలో గ్రామస్తులంతా కలిసి చివరి రోజు భోజనాలు ఏర్పాటు చేసుకుని పిల్ల పాపలతో తింటారు. ఈ రకంగా పండుగ నిర్వహించుకుంటే పంటలు బాగా పండుతాయని గిరిజనుల నమ్మకం.