ప్రజాశక్తి - ఆదోని
ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మార్కెట్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ అభివృద్ధి కోసం రూ.40 లక్షలతో అనేక పనులు చేపట్టినా వ్యాపారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచారని, రోడ్డుపై వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ.40 లక్షలతో పాత మార్కెట్‌ను కొత్తగా నిర్మించినట్లు, అందులో వ్యాపారం చేయకుండా అక్కడ అంతా ఖాళీగా పెట్టి రోడ్లపై కూరగాయల విక్రయం ఎలా చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. రోడ్డుపై తిరగడానికి కూడా ఇబ్బంది ఉందని, రోడ్లపై వ్యాపారాన్ని వెంటనే తొలగించాలని తెలిపారు. ఎవరికి కేటాయించిన స్థలాల్లో వారే వ్యాపారం చేయాలని సూచించారు. వ్యాపారుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగరాదని, ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తామెవరికీ ఇబ్బంది కలిగించడం లేదని, గత 40 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని, తమకు సహకరించాలని కొంతమంది వ్యాపారులు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.
వ్యాపారులకు సూచన చేస్తున్న కమిషనర్ రఘునాథ్ రెడ్డి










