'ఈట్ స్ట్రీట్' ఏర్పాటుకు సన్నాహాలు : కమిషనర్
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించేలా ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. నగరంలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు సిద్దం చేసిన డిపిఆర్ ను బుధవారం ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు సాయంత్రం వేళ ఆహ్లదంతో పాటు చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈట్ స్ట్రీట్ నందు కల్తీ లేని శుచి, శుభ్రతతో కూడిన ఆహార పదార్థాలను ప్రజలకు అందించనున్నామని అన్నారు. ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు పరమాచార్య మార్గం ను పరిశీలిస్తున్నామని అన్నారు. ఇక్కడ 30 నుండి 40 చిన్న షాపులు తాత్కాలికంగా ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యేకమైనఆహారపదార్థాలను అందించేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రజలు వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునెలా చూడాలని, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు సేదతీరెలా అన్ని ఏర్పాట్లు జరిగేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, డి.సి.పి. శ్రీనివాసులు రెడ్డి, ఏ.సి.పి. బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.










