గాజా : హమాస్ అణచివేత పేరుతో మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్ మరింతగా రెచ్చిపోయి అమానవీయ దాడులకు తెగబడుతోంది. మంగళవారం గాజాలోని అతిపెద్ద శరణార్థుల శిబిరం జబాలియాపై బాంబుల వర్షం కురిపించింది. శిథిలాల నుండి పురుషులు, మహిళలు, చిన్నారులను సహాయక బృందాలు బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎంత మంది మరణించారన్న దానిపై స్పష్టత లేదని సమీపంలోని ఆస్పత్రి డైరెక్టర్ అటేఫ్ అల్ కహ్లోట్ తెలిపారు. వందలాది మంది గాయపడ్డారని, మరణాల సంఖ్య చెప్పలేమని అన్నారు.
గాజా స్ట్రిప్‌లో బుధవారం ఇంటర్నెట్ మరియు టెలి కమ్యూనికేషన్‌ను నిలిపివేశారు. దేశంలో ఈ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించినందుకు తాము చింతిస్తున్నామని పాలస్తీనా టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ పాల్టెల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
పౌరుల నివాసాల్లో ఏర్పాటు చేసిన హమాస్ కమాండ్ సెంటర్‌ను భూగర్భ సొరంగంలో ఉన్న నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై పేలుళ్లకు కారణమైన కీలక హమాస్ కమాండర్ మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది.
గాజా వేలాది మంది పిల్లల స్మశాన వాటికగా మారిందని ఐరాస మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. డజన్ల కొద్దీ , తర్వాత వందల సంఖ్యలో, చివరికి వేల సంఖ్యలో చిన్నారుల మరణించారని, కేవలం 15 రోజుల్లోనే ఇంతమంది చిన్నారులు మరణించడంపై తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది.