Dec 16,2021 06:58

జె.ఎన్‌.టి.యు సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పడి 13 సంవత్సరాలు అవుతున్నా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. నాలుగు వందల అరవై మంది అధ్యాపకులు ఉండవలసిన చోట కేవలం 65 మంది అధ్యాపకులతో కాలం వెళ్లదీస్తున్నారు. వందకు పైగా అదనపు బాధ్యతలు. ఇంతవరకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడేషన్‌ రాక సతమతమవుతోంది. రెండు సంవత్సరాల కిందట జరిగిన నియామకాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. అందులో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించారని చెప్తున్నా ఇంతవరకు దొడ్డి దారిన వచ్చిన వారిపై చర్యలకు ఉపక్రమించడం లేదు. విశ్వవిద్యాలయానికి రీసర్చ్‌ గ్రాంట్లు లేవు. ఉన్న అరకొర నిధులు బ్లాక్‌ గ్రాంట్లు జీతభత్యాలకు సరిపోవడం లేదు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో లక్షలు ఖర్చు చేసి ఉప కులపతుల కాన్ఫరెన్స్‌ పెట్టారు. పట్టుమని నలుగురు ఉపకులపతులు హాజరు కాలేదు. ఇప్పుడు ఏం వొరగబెట్టారని 75 వసంతాలు పండుగ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇంకొక వైపు రిజిస్టర్‌ గారు ఒక ప్రత్యేక సంచిక విడుదల చేయనున్నట్లు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల ఆర్థిక సహకారం కోరుతూ లేఖలు రాస్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి రీసర్చ్‌ గ్రాంట్లు లేవు. అధ్యాపకులు మేజర్‌, మైనర్‌, మోర్డ్‌ రాబ్స, విమెన్‌ సైంటిస్ట్‌ గ్రాంట్లు లేని ఏకైక విశ్వవిద్యాలయం. ఇరవైకి పైగా ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లు పెట్టారు. సరిపడా అధ్యాపకులు లేరని నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డు తేల్చిచెప్పినా ఢిల్లీలోని ఏఐసిటిఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కానీ లోపం ఎక్కడుందో గ్రహించడం లేదు. ఎం.సి.ఎ, ఎం.బి.ఎ కోర్సులు పెట్టి పాతిక సంవత్సరాలు కావస్తున్నా శాశ్వత అధ్యాపకులు నియమించని విశ్వవిద్యాలయం. ఇక ప్రైవేటు కళాశాలలో పి.జి చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించక చాలా కళాశాలలు మూతపడ్డాయి. ఇంజినీరింగ్‌ అడ్మిషన్లు ఆగస్టు నెలలో పూర్తి చేయాల్సిన అధికారులు తీవ్ర జాప్యంతో కేవలం రెండు విడతలు అడ్మిషన్లు మాత్రమే డిసెంబర్‌ నెల వరకు పూర్తి చేయడంతో విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో చేరిపోయారు.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ కు పదవ షెడ్యూలు కింద ఏర్పాటైన కేంద్ర విశ్వవిద్యాలయం మొదలుపెట్టి ఆరు సంవత్సరాలైంది. ఇంతవరకు ఏమాత్రం అభివృద్ధి నోచుకోక సమస్యలకు కేంద్ర బిందువుగా తయారైంది. నిధుల లేమితో నేడు శ్మశాన ప్రశాంతత నెలకొంది. ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, పికెటింగ్‌, రాస్తారోకోలతో సరిపోతోంది. కేంద్ర విశ్వవిద్యాలయం కోసం బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో దాదాపు 800 ఎకరాల స్థల సేకరణ జరిగి ఐదు సంవత్సరాలవుతుంది. ఇంతవరకు శాశ్వత భవనాల నిర్మాణాల ఊసే లేదు. విశ్వవిద్యాలయం ఏర్పాటైన నాటి నుండి జెఎన్‌టియు క్యాంపస్‌లో తరగతులు నడుపుతున్నారు. మొదటి మూడు సంవత్సరాలు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మెంటర్‌గా ఉండేది. ఇక్కడ విశ్వవిద్యాలయానికి గత సంవత్సరం ఉపకులపతి ని నియమించారు. ఉపకులపతి తప్ప ఇక్కడ పని చేస్తున్న అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఒప్పంద ఉద్యోగులే. ఇంతవరకు పోస్టులు శాంక్షన్‌ కాలేదు. భవనాల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నయా పైసా విడుదల చేయలేదు. ఇక ఇక్కడి కోర్సులు చూస్తే అన్నీ ఆర్ట్స్‌ కోర్సులు. ప్రవేశ ప్రకటన అక్టోబరులో ఇస్తే అప్పటికి విద్యార్థులు ఏదో ఒక కళాశాలలో చేరి ఉండడంతో వచ్చే విద్యార్థులు కూడా నాసిరకంగా ఉంటున్నారు. ఇక్కడి కోర్సులు కూడా డిమాండ్‌ లేని కోర్సులు. ఒకప్పుడు టైపు రైటింగ్‌ కోసం రాజమండ్రి వెళ్లే వారు. ఇప్పుడు ఇలాంటి కోర్సుల కోసం కేంద్ర విశ్వవిద్యాలయానికి రావాలా? ఇంత దూరం వచ్చి చేరేకంటే నగరంలో ఏదో ఒక కళాశాలలో చేరడం ఉత్తమమని విద్యార్థులు భావిస్తున్నారు. పేరుకే కేంద్ర విశ్వవిద్యాలయం కానీ అది ప్రైమరీ స్కూల్‌ కంటే హీనంగా ఉంది. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్‌, రిజిస్ట్రార్‌, డీన్లు, శాశ్విత అధ్యాపకులు లేని విద్యా సంస్థగా వెలసింది. గత ఏడు సంవత్సరాలుగా ఏ ఒక్క అంశంలోనూ అభివృద్ధి ప్రమాణాలు సాధించలేదు. అన్ని రంగాలు పతనావస్థలో ఉన్నాయి. ఉద్యోగ క్షీణత కేంద్ర విశ్వవిద్యాలయాల లోను, ఐఐటి లలో 48 శాతం ఉంటున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నదనడంలో సందేహం లేదు.
                                                                                          - డా|| పి. రాజ్‌ నవీన్‌