Aug 28,2023 23:34
ఇసుక తవ్వకాలతో చెరువులుగా మారిన భూములను పరిశీలిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: అక్రమ ఇసుక తవ్వకాలతో శివారు గ్రామాలు చెరువులుగా మారుతున్నాయని బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఆరోపించారు. సోమవారం బాపట్ల పట్టణం కొత్తపాలెం శివారు కో ఆపరేటివ్‌ సొసైటీ భూముల్లో ఇసుక అక్రమ దందా జరుగుతున్న ప్రాంతాన్ని నరేంద్రవర్మ సందర్శిం చారు. అక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక దందాలతో ఆ పార్టీ నాయకులు రూ.కోట్లు గడిస్తూ ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. బాపట్ల వైసీపీ నాయకులు రైతుల వద్ద నుంచి అక్రమంగా భూములు లాక్కుని ఇసుక వ్యాపారం చేయడం దారుణమన్నారు. ప్రకృతి వనరులు దోపిడీ జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నార న్నారు. ఈ ఇసుక దందా ఎమ్మెల్యే కోన రఘుపతి కనుసన్నల్లోనే జరుగుతుందని నరేంద్రవర్మ ఆరోపించా రు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందాపై తెలుగు దేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొలపల శ్రీనివాసరావు, ముక్కామల సాంబశివరావు, కనుమూరి సాంబమూర్తిరాజు, కావూరి శ్రీనివాసరెడ్డి, ఇనగంటి గాంధీ, గుడిపల్లి సాంబశివరావు, ఫరీద్‌ మస్తాన్‌, వెంకట్రావు, మందపాటి అంద్రెయ, పరిశా రమేష్‌ గౌడ్‌, సూరగాని శేఖర్‌, మందపాటి ఆంద్రేయ, బొడ్డు గోవిందు, కుట్టుబోయిన రమేష్‌, అమృతరాజు, కుంచాల సుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలను ఆపండి: ఆనందబాబు
కొల్లూరు: చంద్రబాబు ఆదేశాల మేరకు ఇసుక దోపిడీపై సత్యాగ్రహం పేరుతో కొల్లూరు మండల పరిధిలోని జువ్వలపాలెం చిలుమూరు గ్రామాలలో సోమవారం అక్రమ ఇసుక డంపింగ్‌ యార్డులను టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ క్వారీలపై కోర్టు ఆపమని ఆదేశాలు ఇచ్చినా ఇసుక రవాణా చేస్తున్నారని, మే నెలలో జేపీ సంస్థ గడువు పూర్తయినా ఇసుక రవాణా చేస్తున్నారని అన్నారు. ఇసుక తరలింపులకు అనుమతులు చూపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఈరోజు ఇసుక ర్యాంపులు సందర్శించినట్లు తెలిపారు. వాటాలు తీసుకున్న ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టేది లేదని నక్కా ఆనందబాబు అన్నారు.