
మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో ఇసుక కూడా ఒకటి. భూమి మీద నీటి తరువాత అత్యధికంగా వినియోగమవుతున్న సహజ వనరు కూడా ఇదే! మానవాళి నిత్య జీవితంలో ఇంత కీలకంగా మారిన ఈ వనరు భూమి మీద నుండి మాయమయ్యే ప్రమాదం ఉందంటూ ఐక్యరాజ్య సమితి తాజాగా హెచ్చరించడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. చర్చనీయాంశంగా మారింది. నిజానికి ప్రకృతి వనరులన్నింటిని సరుకులుగా మార్చి లాభాలను పోగేసుకోవడం పెట్టుబడిదారీ మాయాజాలంలో భాగమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇసుక వినియోగం, వాణిజ్యం భారీగా పెరిగిపోయింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2017వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 9.55 బిలియన్ టన్నుల ఇసుక, గ్రావెల్ వినియోగమయ్యేది. తాజాగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్‌ఇపి) రూపొందించిన నివేదికలో ఆ వినియోగం ఏడాదికి 50 బిలియన్ టన్నులకు చేరిందని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇసుక వ్యాపారం విలువ ఏడాదికి 70 నుండి 80 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా! ఇదే మాదిరి కొనసాగితే రానున్న పది పదహేను సంవత్సరాల్లో ఇసుక వినియోగం కొన్ని వందల రెట్లు పెరిగే అవకాశం ఉందని యుఎన్‌ఇపి అంచనా వేసింది. అదే జరిగితే భూమి మీద ఇసుక లభ్యత సంగతి అలా ఉంచితే, భూగోళం ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఈ ఇసుక దోపిడిని ఆపాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాల వల్ల అనేక పర్యావరణ సమస్యలతో పాటు, సామాజిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇసుకతో పాటు నీరు కూడా మాయమవుతోంది. ఇది జలచరాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో చేపల లభ్యత గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో చేపల వేటపై ఆధారపడిన జనం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తోంది. ఇండోనేషియా, కంబోడియా వంటి దేశాల్లో ఇది సామాజిక సమస్యగా మారింది. మన దేశం, రాష్ట్రంలోనూ విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్న చోట్ల చేపలు గతంలో మాదిరి దొరకడం లేదన్న మాట మత్స్యకారుల నుండి వింటూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో నదులు ప్రవాహ దిశను మార్చుకుని ఆకస్మిక వరదల రూపంలో విరుచుకు పడుతున్నాయని, భూ కోత పెద్ద ఎత్తున చోటుచేసుకుంటోందని, ఫలితంగా కొన్ని దీవులు మాయమవుతున్నాయన్నది వివిధ పరిశీలనల సారాంశం. తాగునీటిని సేకరించేందుకు మహిళలు గతంతో పోలిస్తే రెండు నుండి మూడు గంటలు అదనంగా శ్రమించాల్సి వస్తోందని, ఇది వారి మానసిక, ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని శ్రీలంకతో పాటు ఆఫ్రికా దేశాల్లో సాగిన అధ్యయనాలు తేల్చాయి. ప్రకృతిలో ఇసుక తయారు కావడానికి పట్టే సమయంతో పోలిస్తే వినియోగం వేల రెట్లు వేగంతో జరుగుతోందన్నది ఐక్యరాజ్యసమితి తాజా నిర్ధారణ. ఈ వినియోగపు తీరే ఇసుక కొరతకు దారి తీస్తోంది.
ఆసియా దేశాల్లో పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతుండటంతో రానున్న సంవత్సరాల్లో ఇసుక వినియోగం మరింతగా పెరగనుందని సమితి అంచనా వేసింది. ఈ అంచనా సంగతి ఎలా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఉపాధి కోసం ఎక్కువ మంది ఆధారపడింది భవన నిర్మాణ రంగమే! ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలు కావడంతో రాష్ట్రంలో చోటుచేసుకున్న దుష్పరిణామాలు ఇటీవలే చూశాం. అయినా, వాటి నుండి ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. అట్టహాసంగా చెప్పే విధానాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆచరణలో అధికారపార్టీ నేతల, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. చలానా కట్టిన వారికన్నా కట్టని వారికే నాణ్యమైన ఇసుక వెంటనే లభించిన సంఘటనలు కోకొల్లలు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ తరహా సంఘటనలు ఐక్యరాజ్యసమితి నివేదికలో ప్రస్తావనకు వచ్చాయి. వాటిని నివారించడానికి ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టారని, డ్వాక్రా మహిళలకు రీచ్‌లను అప్పగించారని, ఇది వారి ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసిందని నివేదికలో పేర్కొన్నారు. దీనిలో నిజానిజాలేమిటో రాష్ట్ర ప్రజలకు బానే తెలుసు. ఉపాధి కల్పనతో పాటు, అభివృద్ధికి కీలకమైన ఇసుక వినియోగం, నియంత్రణకు సంబంధించి పటిష్ట విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే! ఆ దిశలో చర్యలు తీసుకోవాలి.