
ప్రజాశక్తి -కోటవురట్ల:మండలంలో అక్ర మంగా ఇసుక, మట్టి రవాణా చేసే వారిపై ఉక్కు పాదం మోపాలని తహసిల్దార్ జానకమ్మ తెలిపారు. బుధవారం రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుండి మట్టి, ఇసుక అక్రమంగా రవాణా అవుతున్న విషయం పలు గ్రామాల నుండి ఫోన్ల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అక్రమంగా రవాణా జరుగుతున్న గ్రామాలలో నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే పోలీసుల సహకారం తీసు కోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటికే వివిధ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో అందజేయాలన్నారు. సర్వే నిర్వహిస్తున్న గ్రామాల పట్ల రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఉర్ధవరావు, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.