ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ : ఇసుకను తరలించే లారీకి క్లీనర్‌గా వచ్చిన యువకుడు ఇసుకలో కూరుకుపోయి మృత్యువాత పడ్డాడు. ఇప్పటికే తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబానికి ఆదరువుగా నిలుస్తున్న కుమారుడూ చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వివరాల ప్రకారం.. పార్వతీపురానికి చెందిన బండారు వర్మ తండ్రి గతంలోనే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తల్లి, చెల్లి పోషణ బాధ్యతను వర్మ తీసుకున్నాడు. ఇందులో భాగంగా లారీ క్లీనర్‌గా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంటిఎం పరిధిలోని గుండిమెడ నుండి ఇసుకను తరలించే వాహనంపై పనికి వెళ్లాడు. బుధవారం రాత్రి లారీ ఇసుక పాయింట్‌లో ఉండగా దానికి పొక్లెయినర్ ఇసుక నింపుతోంది. అయితే లారీ బాడీలో ఉన్న వర్మపై ఇసుక పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది తెలిసిన పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి మృతదేహాన్ని తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా యువకుని మృతి విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నాయకులు కె.సుందరయ్య, పి.వేణు పరిశీలించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యువకుడు మృతి పట్ల పలు అనుమానాలున్నాయని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వకాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఇసుక సరఫరా చేసే జేపీ కంపెనీ బినామీ అని ఆరోపించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని, 15 హెక్టార్లలో అనుమతులుంటే వందలాది హెక్టార్లలో ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఇసుకపై అక్రమాలు జరుగుతుంటే మంగళగిరి ఎమ్మెల్యే ఎక్కడున్నారని ప్రశ్నించారు. గుండిమెడ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపేయాలన్నారు.










