ప్రజాశక్తి-పెద్దవడుగూరు నాలుగున్నరేళ్లపాటు విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక తరలించి కప్పిపుచ్చుకునేందుకు పెన్నానదికి నీరు వదిలారని జెసి సోదరులు దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని టిటిడి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలించి వచ్చిన డబ్బును లెక్కపెట్టుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ప్రజలు, రైతులకు చేసింది శూన్యమన్నారు. ఇసుకను అమ్ముకుని గుంతలు ఏర్పడగా వాటిని కప్పిపుచ్చుకునేందుకు నీరు వదిలారన్నారు. రైతుల నోట్లో దుమ్ముకొట్టి సాగునీరు వదిలానని ఎమ్మెల్యేలు ప్రగడ్భాలు చెప్పుకోవడం బాధాకరమన్నారు. జిల్లాలో నీటి సమస్య ఇంత ఉన్నా ఏటా కర్ణాటకలో జరిగే నీటి సమావేశాలకు వెళ్లే అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. వీరు కర్ణాటక వాళ్లతో లాలూచిపడ్డారా..? అని దుయ్యబట్టారు. చాగల్లు, యాడికి కాలువల్లో జమ్ము గడ్డి పెరిగి నీరు ఎలా పారుతుందో తెలియదా అని ఎద్దేవాచేశారు. కావున రానున్న రోజుల్లో టిడిపి విజయం సాధించేందుకు ప్రతికార్యకర్త, నాయకుడు సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మిమ్మల్ని నమ్మినందుకు వమ్ము చేయకుండా బాగా కష్టపడాలన్నారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు గ్రూపు రాజకీయాలు చేయకుండా కొన్ని పద్ధతులు మార్చుకుని పరస్పరం అవగాహనతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుతం దొంగ ఓట్లకు సంబంధించి జాబితా వచ్చింది. వాటిని పరిశీలించి వాస్తవ ఓటర్లను గుర్తించడంతోపాటు ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జెసి అస్మిత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మాజీమంత్రి జెసి దివాకర్‌రెడ్డి










