ప్రజాశక్తి - అద్దంకి
వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై రెండో రోజు నిరసనలో భాగంగా తహసీల్దార్ జివి సుబ్బారెడ్డి, ఎస్సైకి టిడిపి నేతలు వినతి పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ స్థానిక వైసిపి నేతలు మోదేపల్లి, మణికేశ్వరం, తమ్మవరం, రామాయపాలెం, తిమ్మాయిపాలెం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు ఇష్టారీతిన చేస్తున్నారని అన్నారు. ఇసుక దందా చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని అన్నారు. జేపీ వెంచర్స్‌తో ఒప్పందం ముగిసినప్పటికీ అదే కంపెనీ పేరుతో ఇసుక తవ్వకాలు ఎలా చస్తారని ప్రశ్నించారు. నాలుగేళ్లలో 40కోట్ల టన్నుల ఇసుకతవ్వి 40వేల కోట్లు సిఎం జగన్ దోచేశారని ఆరోపించారు. ఇసుక ధరలను ఇష్టానుసారంగా పెంచి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండాచేసి వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని అన్నారు. టెండర్లు పిలవకుండా, కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా, ఎన్‌జిటి విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా ఇసుక తవ్వకాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చిన ఈప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సంసిద్దంగా ఉన్నారని టిడిపి నేతలు అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నాగిని రామకృష్ణ, పరిటాల రామాంజనేయులు, గోరంట్ల దాసు, పూర్ణ పాల్గొన్నారు.










