Aug 29,2023 22:18

పరిగిలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద టిడిపి నాయకుల ఆందోళన

ప్రజాశక్తి - పరిగి : ఇసుక దోపిడీకి బాధ్యుడు సిఎం జగన్మోహన్‌ రెడ్డి అని పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు.గురువారం పరిగి మండలం కాలువపల్లి శివాలయం వద్ద డంప్‌ చేసిన ఇసుక వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ దందాపై ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో ప్రతి ఇసుక రీచ్‌ వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టామని అన్నారు.ప్రభుత్వం చేస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. వాల్టా చట్టం అమలులో ఉన్నప్పటికీ ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని విమర్శించారు. తరచు రాత్రి వేళల్లో వందకు మించి టిప్పర్లు కర్నాటకకు చేరుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు మైనింగ్‌ అటు మట్టి తరలింపులలో కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నారని విమర్శించారు. ఇలాంటి తరలింపువల్ల కరువు ను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇటీవలే ప్రభుత్వం చేస్తున్న అక్రమ మైనింగ్‌ పై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇసుక అక్రమ రవాణా ఆపాలని ఇసుక తరలింపు యంత్రాల ద్వారా కాకుండా మనుషులు పని కల్పించే విధంగా తరలించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని డిటి లక్ష్మీ నరసింహకు వినతిపత్రం అందజేశారు. పరిగి మండలంలో సిగి పల్లి ప్రాంతంలో మరో ఇసుక రిచ్‌ ద్వారా అక్రమ తరలింపుకు ప్రభుత్వం సంసిద్ధమైందని ఇలాంటి ఇసుక అక్రమ తరలింపు పై టిడిపి అప్రమత్తంగా ఉండి తరలింపును అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు లక్ష్మారెడ్డి, ఈశ్వరప్ప, సత్యనారాయణ, చంద్రశేఖర్‌, చౌడప్ప, డిఎస్‌ఎల్‌ శ్రీనివాసులు, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : వైసిపి ప్రభుత్వం ఇసుకను అక్రమ వ్యాపారంగా మార్చుకుని...నేడు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసిందని టిడిపి నాయకులు విమర్శించారు. ఈ మేరకు వారు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా అంబేద్కర్‌ సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు నిరసన తెలిపి, డిప్యూటి తహశీల్దార్‌ వెంకటేశ్వర్లులకు వినతిని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అంబికా లక్ష్మినారాయణ, రమేష్‌ కుమార్‌,కొల్లకుంట అంజినప్ప, షఫీవుల్లా, అమర్నాథ్‌, చంద్రమోహన్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.