ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అమరావతి వద్ద కృష్ణానదిలో రహదారులు నిర్మాణం కలకలం రేపింది. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, దీని వల్ల వేలాది మంది ప్రాణాలకు నష్టం జరుగుతుందని పరోక్షంగా ఇది హత్య చేయడమేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం గతంలోనే వ్యాఖ్యానించినా పల్నాడు జిల్లా యంత్రాంగం చూసిచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇసుక పంపిణీ ఒక ఫార్సుగా మారింది. జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రీచ్‌ల నుంచి భారీగా ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇసుక తవ్వకం, రవాణా ఛార్జీలతోపాటు ఆయా ప్రాంతాల్లో ఆధిపత్యం వహించే నేతల అనుచరులు ఎక్కువగా ఇసుకను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. నదీ గర్భంలోనే ఇసుకను ప్రొక్లెయినర్ల ద్వారా తవ్వుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు రీచ్‌ల నుంచి ఇసుకను తెలంగాణ ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక లారీల వల్ల పలు గ్రామాల్లో రహదారులు చిధ్రమైపోతున్నా ఏ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
కొంత కాలంగా నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుకతవ్వకాలు చేపట్టారు. నదీగర్భంలో ఇసుక తవ్వకాలు జరగడం వల్ల ఎక్కడికక్కడ ఊబిలు ఏర్పడుతున్నాయి. దీంతో విహార యాత్రకు వచ్చిన అనేక మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అమరావతి, తాడేపల్లి ప్రాంతంలో తరచూ యువకులు నదిలోని ఊబిలో పడి మృత్యువాత పడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో నదీగర్భానికి చేరువగా తవ్వొద్దనే నిబంధనలను పట్టించుకోవడం లేదు. వైకుంఠపురం, ధరణికోట, అచ్చంపేట మండలం కోనూరు, కస్తల, చింతపల్లి (కొత్తపలి) తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయి.
జిల్లాలో గతంలో జెపి ఇన్‌ఫ్రా సంస్థ ఇసుక విక్రయాలు నిర్వహించింది. ఈ సంస్థ రికార్డులో మాత్రమే ఉండగా అనధికారికంగా జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధికి ఇసుక విక్రయాల బాధ్యతను అప్పగించారు. అమరావతి ప్రాంతంలో కృష్ణానదిలో నదీ ప్రవాహాన్ని నిలుపుదలకు వేసిన రోడ్ల వ్యవహారంపై ఎన్‌జిటికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ అంశంలో టిడిపి, వైసిపి రెండు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మీ హయాంలోనే ఎక్కువ అక్రమాలు జరిగాయంటే మీ హయాంలోనే జరిగాయని ఇటీవల పరస్పర విమర్శలతో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రాజకీయ ఆరోపణలతో అమరావతిలో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో టిడిపి నాయకులు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై పలు ఆరోపణలు చేశారు. ఇసుక విక్రయాలతో తనకు సంబంధం లేదని జెపి సంస్థవారే ఇసుక విక్రయాలుచేస్తున్నారని శంకరరావు ఇటీవల ప్రకటించారు. కానీ శంకరరావు కనుసన్నల్లోనే జరుగుతుందని రాజకీయ వర్గాలో ప్రచారం జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో ఎన్‌జిటికి ఫిర్యాదులు వెళ్లిన విషయం తెలిసినా విక్రయదారుల్లో మార్పురాలేదు. ఎన్‌జిటి అధికారులు స్వయంగా పరిశీలించేందుకు త్వరలో అమరావతి ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ఇసుక ధరలు కూడా ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు ఇసుక దొరకడం లేదు. రవాణా ఛార్జీలు, ఇతర ఖర్చులు కలిపి టన్ను రూ.వెయ్యి పైన పలుకుతోంది. అమరావతి నుంచి గుంటూరుకు 10 టన్నుల లారీ ఇసుక కావాలంటే రూ.10 నుంచి రూ.12 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. కానీ ప్రభుత్వం రూ.475కి టన్ను ఇసుక విక్రయించాలని చెబుతోంది. ఆచరణలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి.










