ప్రజాశక్తి-ఎ.కొండూరు: ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చి తాపీ కార్మికులను ఆదుకోవాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి నరసింహారావు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో ఎ.కొండూరు మండలం భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇనుము, సిమెంటు ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారని అన్నారు. దీంతో తాపీ కార్మికులు పనుల కొరకు వలస వెళ్లి జీవించవలసి వస్తుందని అన్నారు. తాపీ కార్మికులకు ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏ కొండూరు మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షునిగా కోమటి చెన్నారావు, ప్రధాన కార్యదర్శిగా పంబి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా లక్ష్మారెడ్డి, గౌరవాధ్యక్షులుగా జట్టి వెంకటేశ్వరావు, ఉపాధ్యక్షులుగా సిద్ధం విజయరావుతోపాటు 16 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.










