Jan 04,2023 00:13

తహశీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-ఎటపాక
ఏజెన్సీలో 1/70, పీసా చట్టాలను తుంగలో తొక్కి మండలంలోని గుండాల ఇసుక ర్యాంపులో ఇసుక తవ్వకాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటూ రెచ్చిపోతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటని సీపీఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారులు ఇసుక మాఫియాకు అండదండలు కొనసాగిస్తున్నారా, అధికార పార్టీ నాయకులకు అనుమతులు ఇస్తున్నారా తేల్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు. పీసా చట్టానికి వ్యతిరేకంగా జెసిబిలతో నదిలో నుండి ఇసుకను నేరుగా లారీలోకి లోడ్‌ చేసి రవాణా చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారం మనుషులతో లోడ్‌ చేయించి వారికి ఉపాధి కల్పించాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వీటిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇసుక రవాణాలో వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పంచాయతీకి ఇవ్వాల్సి ఉండగా అవేవీ చేయలేదన్నారు. ఇసుకను నేరుగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు వే బిల్‌తో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారన్నారు. నిబంధనలు చట్టాలు ఉల్లంఘిస్తున్నారంటూ స్థానికులు, ప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగా ఆందోళన చేట్టించుకోలేదన్నారు. అధికార పార్టీ నాయకులకు ఇసుక మాఫియాకు భయపడి అధికారులు ఏమీ చేయడం లేదన్నారు. ప్రజా సంపదను దోసుకెళ్తున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరుపై, అధికారులు నిర్లక్ష్యంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆయన హెచ్చరించారు. అక్రమార్కుల గుప్పెట్లో నుండి స్థానిక సొసైటీకు గుండాల ఇసుక ర్యాంపు అప్పగించి, స్థానికులకు ఉపాధి కల్పించే వరకు సిపిఎం పోరాడుతుందని మర్లపాటి నాగేశ్వరరావు తెలిపారు.
గుండాల ర్యాంపు మూసివేయాలని వినతి
ఎటపాక : అక్రమ అనుమతులతో నిర్వహిస్తున్న గుండాల ఇసుక ర్యాంపును తక్షణం మూసివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో తహశీల్దారు వేణుగోపాల్‌ వినతి పత్రం ఇచ్చారు. గుండాల గ్రామంలో ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి, పీసా గ్రామసభల అనుమతి లేకుండా దొడ్డిదారిన అధికారులను పక్కదారి పట్టించి ఇసుక మాఫీయా రెచ్చిపోతుందని తెలిపారు. ప్రజా సంపదను దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఎం ఎటపాక మండల కార్యదర్శి ఐ వి, ఇరపా అజరు, గద్దల హుస్సేన్‌, ఇరపా సత్యం, తోట శ్రీను, మాటూరి బాలకష్ణ, ఇరపా హరి, ఇరపా కోటి ఉన్నారు.
టిడిపి వినతి
చింతూరు : అల్లూరి సీతారామ జిల్లా ఎటపాక మండలం గుండాల గ్రామంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక ర్యాంపుపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం మండల ఎటపాక కమిటీ తరఫున ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు అధికారి వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పుట్టు రమేష్‌, మాచినేని రాజేష్‌, వల్లభనేని చందు, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు విజ్జగిరి రవితేజ చింతూరు మండల అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి ప్రధాన కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరావు, జి సురేష్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై ఐటిడిఏ పిఓ చట్ట పరమైన చర్య తీసుకోవడం జరుగుతుందని టిడిపి బందానికి హామీ ఇవ్వడం జరిగింది.