ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమ తవ్వకాలతో నదీ ప్రవాహం దిశ మారి సాగు, తాగునీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారని టిడిపి నాయకులు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్ ఆరోపించారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని రోణంకిలో ఇసుక ర్యాంపు వద్ద రైతులతో కలిసి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిరోజూ వందల లారీలతో రాత్రీ పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని, దీనివల్ల నదీగర్భం కోతకు గురై భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయన్నారు. దీంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నదిలో 70 వేల క్యూసెక్కుల నీరున్నా, బ్యారేజీకి రాకపోవడానికి కారణం నదిలో 25 అడుగుల మేర అక్రమ తవ్వకాలు చేపట్టడమేనన్నారు. గొట్టాబ్యారేజీ వద్ద డౌన్ స్ట్రీమ్ వైపు బౌల్‌డర్ ఎప్రాన్ పూర్తిగా దెబ్బతిందని, బ్యారేజీ దెబ్బతిన్నా మరమ్మతులు చేయడం లేదని విమర్శించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు పేషీ, అధికార పార్టీ స్థానిక నాయకులు కొంతమంది అధికారులతో కలిసి ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందని విమర్శించారు. ధర్నాలో సింగుపురం ఎంపిటిసి పంగ సత్యనారాయణ, బైరి మాజీ ఎంపిటిసి అమ్మన్నరావు, అలికాం ఎంపిటిసి నాగేశ్వరరావు, రెడ్డి గిరిజాశంకర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.










