ప్రజాశక్తి-బాపట్ల రూరల్
గత మూడు రోజులుగా బాపట్ల స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు చేస్తున్న వరుస దాడులతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. సోమవారం ధరివాది కొత్తపాలెం ప్రాంతంలో రెండు, మంగళవారం పాండురంగపురం గ్రామ పరిధిలో ఒకటి, బుధవారం పట్టణ శివారు ప్రాంతంలో ఒకటి మొత్తంగా మూడు రోజులలో నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సెబ్ సీఐ సుంకర శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాపట్ల కార్యాలయ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తమ కార్యాలయం లిమిట్స్‌లో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తవ్వకాలు నిర్వహించినా, రవాణా చేసినా ఉపేక్షించేది లేదని సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, బెల్టు షాపుల్లో మద్యం నిలువ చేసినా, రవాణా విక్రయాలు నిర్వహించినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రతి వాహనాన్ని తనిఖీచేసి సరైన అనుమతి పత్రాలు ఉంటేనే ఆ వాహనం ముందుకు వెళుతుందని, లేదంటే నేరుగా స్టేషనుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే పెద్దఎత్తున జరిమానాలు తప్పవని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణ శివారు కర్లపాలెం రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనికి గాను రూ.10వేలు జరిమానా విధించామని, ట్రాక్టర్‌ను సెబ్ కార్యాలయానికి తరలించామని తెలిపారు. ఈ దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.










