Feb 23,2023 22:27

ప్రజాశక్తి-నందిగామ: నందిగామ మండలంలో కంచల, మాగల్లు గ్రామాలలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయం ఎదురుగా టిడిపి ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. అనంతరం ఆర్‌డిఒ రవీంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నందిగామ మండల అధ్యక్షులు వీరంకి వీరాస్వామి, నాయకులు తోట నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల అనుమతులు గత సంవత్సరం డిసెంబర్‌ 26తో ముగిసిపోయినా, అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ రోజూ పదుల నుంచి వందల సంఖ్యలో అక్రమ రవాణా చేస్తున్నారని మండిపడ్డారు. అనుమతులు లేకపోయినా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అనుగుణంగా పెద్ద జెసిబిలను పెట్టి ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. ఈ విషయాలపై మాట్లాడుతుంటే వైసిపి నాయకులు తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణమే అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏచూరి రాము, కాసర్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.