సిపిఎం జిల్లా నేత వెంకన్న
ప్రజాశక్తి- దేవరాపల్లి : మండలంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైవాడ జలాశయం గేట్లు ఎత్తేయడంతో శారదా నదిలో ప్రవాహం పెరిగి, ఎక్కడికక్కడే భారీగా ఇసుక వచ్చి చేరిందన్నారు. దీన్ని ఇసుక మాఫియా ఆసరాగా తీసుకుని, ఎక్కడికక్కడే విచ్చలవిడిగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసి, యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాతో వ్యాపారం సాగిస్తూ అక్రమార్కులు లక్షల్లో గడిస్తున్నారన్నారు. కలిగోట్ల, తెనుగుబూడి, వెంకటరాజుపురం, తిమిరాం, వేచలం, తమరబ్బ ప్రాంతాలు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, ఇసుక మాఫియా అంతా అధికార పార్టీ నేతలు, అధిపతులే కావడంతో అధికారులు నోరు మెదపడం లేదన్నారు. ప్రభుత్వ పనులకు, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు అనుమతులతో ఎవరు ఇసుక తీసుకువెళుతున్నారో? ఎవరు వ్యాపారానికి ఇసుక తరలిస్తున్నారో గందరగోళ పరిస్థితులు కల్పించి ఇసుక మాఫియా లాభపడుతోందన్నారు. ఇసుక రవాణాకు ఒక పాలసీ లేకపోవడంతో విచ్చలవిడి వ్యాపారానికి అంతూపొంతూ లేకుండా పోతోందని వెంకన్న మండిపడ్డారు. అక్రమార్కులు, మాఫియా యథేచ్ఛగా ఇసుక తరలిస్తుంటే, అభివృద్ధి పనులకు అనుమతులిస్తున్నామని తహశీల్దార్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఇస్తున్న ఇసుక కూపన్లులో ఏ పనికి, ఎంత ఇసుక అవసరం, ఇస్తున్న కూపన్లు ఎక్కడి నుంచి ఎవరు, ఏ పనికోసం తరలిస్తున్నారో స్పష్టత లేకపోవడం వల్ల అక్రమాలకు ఆస్కారమిచ్చేదిగా ఉందని వెంకన్న ఆరోపించారు. తిమిరాంలో నిబంధలనకు విరుద్ధంగా ప్రొక్లెయినర్‌తో ఇసుకను ఎత్తి తరలిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తిమిరాంలో శివాలయం సమీపాన, కలిగొట్లలో బ్రిడ్జి సమీపంలో ఆదివారం యథేచ్ఛగా ఇసుకను తవ్వి తరలిస్తున్నా ఎటువంటి చర్యల్లేకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర సంబంధిత అధికారులు స్పందించి, శారదానది నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక రవాణాను అరికట్టాలని వెంకన్న డిమాండ్ చేశారు.










