Oct 27,2023 22:10

ప్రజాశక్తి - నల్లజర్ల మండలంలోని ఎర్ర కాలువ నుంచి అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. కళ్లెదుటే భారీఎత్తున అక్రమంగా ఇసుకను తరలించుకుపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మండలంలోని పోతవరం, పోతునీడుపాలెం, కవులూరు, నబిపేట, అనంతపల్లి, గ్రామాల వెంబడి ఉన్న ఎర్ర కాలువ నుంచి అక్రమార్కులు ఇసుకను రాత్రి, పగలు అన్న తేడా లేకుండా తరలించుకుపోతున్నారు. ప్రతీ రోజు సుమారు 80 నుంచి 100 ట్రాక్టర్ల వరకు ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. గ్రామాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఇసుమంత ఇసుక కరువైపోగా పక్క మండలాల్లోని గ్రామాలకు స్థానికంగా ఉన్నటువంటి ఎర్రకాలు నుంచి ఇసుక తరలిపోవడం స్థానిక నిర్మాణదారులకు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇసుక తరలించేందుకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన అను మతులు లేనప్పటికీ అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకుం టున్నారు. అక్రమ ఇసుక రవాణాను ఎవ్వరైనా నిలదీస్తే వారికి కొంతమొత్తంలో చేతులు తడిపి వారు మాత్రం వేలకు వేలు కూడబెట్టు కుంటున్నారు. ఒక ట్రక్కు ఇసుక రూ.4 వేల నుంచి డిమాండ్‌ను బట్టి రూ.6 వేల వరకూ అమ్మకాలు చేస్తున్నారు. ఈవిధంగా ఒక్కో ట్రాక్టర్‌ నుంచి రోజుకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ దోచుకుంటున్నారు. గతంలో పోలీసు, రెవెన్యూ అధికారులు ఇసుక ట్రాక్టర్‌ కనిపిస్తే కేసు రాసేవారు. ప్రస్తుతం రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.