ప్రజాశక్తి - కొల్లూరు
ఇసుక దోపిడీపై టిడిపి నాయకులు రెండో రోజు ఇసుక సత్యాగ్రహం నిర్వహించేందుకు టిడిపి మండల కన్వీనర్ మైనేని మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇసుక క్వారీల వద్దకు బయలుదేరారు. టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు. దీంతో పోలీసులు, టిడిపి నేతలకు వాగ్వివాదం జరిగింది. టిడిపి మండల కన్వీనర్ మైనేని మురళీకృష్ణ రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. పోలీసులు మురళీకృష్ణను అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. ఇది తెలుసుకున్న టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిఐ, ఎస్ఐతో మాట్లాడారు. అక్రమంగా ఇసుక దందా మీద చర్యలు తీసుకోవాలని తహశీల్దారుకు, సీఐకి, ఎస్సైకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నాయకులు బరితెగించారని అన్నారు. ఇసుక అక్రమ దందా చేస్తూ కోట్లు గడిస్తున్నారని అన్నారు. ప్రజలకు మంచి చేస్తాడని నమ్మి గెలిపించిన మంత్రి మేరుగ నాగార్జున అవినీతి మత్తులో సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. భూగర్భ జలాలు ఇంకి పోతున్నాయని అన్నారు. రైతులు, ప్రజలు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జేపీ వెంచర్స్‌కి ఇచ్చిన గడువు ముగిసినా అదే పేరుతో దొంగ బిల్లులను సృష్టించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోకుంటే జిల్లా కలెక్టర్, తహశీల్దారు, పోలీసులపై కోర్టకు, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకటసుబ్బయ్య, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కనకాల మధుసూదన ప్రసాద్ పాల్గొన్నారు.










