ప్రజాశక్తి-పాడేరు:పరీక్షల్లో సత్ఫలితాలను సాధించేం దుకు విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా మనసుపెట్టి ఇష్టపడి చదవాలని భారత మానసిక వైద్య సంఘం జాతీయ అధ్యక్షులు, ప్రభుత్వ మానసిక ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఎన్‌ఎన్ రాజు విద్యార్థినులకు ఉద్బోధించారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు బాలికల గురుకుల కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పరీక్షలలో మంచి ఫలితాలు - మార్గాలు అనే అంశంపై గిరిజన విద్యార్థులకు శనివారం సాయంత్రం సెమినార్ నిర్వహించారు. ముఖ్య వక్త ఎన్‌ఎన్ రాజు మాట్లాడుతూ, పరీక్షలంటే విద్యార్థినుల లలో సహజంగా ఉండే భయాన్ని, ఆచరించాల్సిన నియమాలకు సూచనలను వివరించారు. భయం, ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యకర అలవాట్లపై వివరించారు. ఖాళీ సమయాల్లో ఆటపాటలు, రాయడం, చదవడం సంగీతం వినడం వంటి అలవాట్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని ఆయన సూచించారు. పరీక్షలప్పుడు సమయాన్ని వృధా చేసుకోకుండా నిర్ణీత కాలాన్ని గమనంలో పెట్టుకుని చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆందోళన విడిచిపెడితే చదివినవన్నీ గుర్తుంచుకొని పరీక్షల్లో బాగా రాయగలుగుతారని ఆయన చెప్పారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి.చిన్నారావు మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలకు ముందు నుంచే చదివితే మంచి ఫలితాలు సాధించ వచ్చునని తెలిపారు. చదువు పట్ల ఏకాగ్రత, ప్రశాంతత చాలా అవసరమన్నారు. మంచి లక్ష్యాలు నిర్దేశించుకుని తమ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలన్నారు. చదవడం, రాయడం, గ్రూపు చర్చలతో ఎక్కువగా జ్ఞాపకశక్తి ఉంటుందన్నారు. ఏదైనా ఉద్యోగం సాదించాలంటే గట్టిగా సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రామలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు బి.నరేష్, పి.వరహాలు, మండల నాయకులు మాణిక్యం, మత్స్యరాజు, విద్యార్థులు పాల్గొన్నారు..










