Sep 26,2023 21:26

ఇష్టారాజ్యం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రీజియన్‌ కార్యాలయంలో ఇష్టారాజ్యం నడుస్తోంది. జిల్లాలోని ఆర్‌డి కార్యాలయంలోని సీనియర్‌ ఉద్యోగుల త్రయం రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవ లేదన్న సామెత చందంగా వ్యవహారం సాగిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో గతేడాది నుంచి ఉద్యోగుల బదిలీలు, డిప్యూటేషన్లపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. జోన్‌-4 పరిధిలోని ఆర్‌డి కార్యాలయ ఉద్యోగులు అవకాశాన్ని భారీగా సొమ్ము చేసుకోవడంపై ఉన్న ధ్యాస మినహా ఇవేమీ పట్టడం లేదనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. గతానికి భిన్నంగా ఇటీవల అధికార పార్టీల నేతల సేవల్లో సేద తీరుతుండడం వ్యవహారం పరాకాష్ట్రకు చేరుకుంది. ఫలితంగా అర్హత కలిగిన వేలాది మంది ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. రిక్రూట్‌మెంట్‌ గడువు ముగియడం దగ్గర నుంచి బదిలీలు, డిప్యూటేషన్ల నిషేధం అమలు వరకు యథేచ్ఛగా ఉల్లంఘనలకు గురవుతున్నాయి.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రీజియన్‌ కార్యాలయం నిబంధనల ఉల్లంఘనకు నిలయంగా మారింది. ఈ ఏడాది జనవరిలో ఎంపిహెచ్‌ఎస్‌ ఉద్యోగుల బదిలీలు, రిక్రూట్‌మెంట్‌ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. సీనియర్‌ ఎంపిహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు ఆప్షన్‌ ఇచ్చిన అనంతరం రిక్రూట్‌మెంట్‌ నిర్వహించారు. అనంతరం మిగిలిన ఖాళీలకు రిక్రూట్‌మెంట్‌ నిర్వహించడం గమనార్హం. ఇంతవరకు భాగానే ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఏడాదికిపైగా బదిలీలు, డిప్యూటేషన్ల రద్దు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆర్‌డి కార్యాలయ ఉద్యోగులకు ఇవేమీ పట్టడం లేదని, వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకోవడం మినహా మరేమీ పట్టించు కోవడం లేదనే విమర్శ ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. రిక్రూట్‌మెంట్‌ అనంతరం రోజుల తరబడి అపాయింట్‌మెంట్‌ లెటర్లు పంపించకపోవడం దగ్గర నుంచి సందులో సడేమియాగా తమను కలిసిన, అనుకూలమైన ఉద్యోగులకు కోరిన స్థానాలకు మార్చడం వంటి ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాలోని అధికార పార్టీకి చెందిన నేతల సిఫారసులకు అనుగుణంగా బదిలీల నిషేధం రద్దును పక్కనబెట్టి బదిలీలకు తెర లేపడం చర్చనీయాంశంగా మారింది. 15 రోజుల వ్యవధిలో బదిలీల నిషేధం ఉత్తర్వులను బేఖాతర్‌ చేస్తూ నేతల సిఫారసుల అనుసారం 3 నుంచి 12 మంది ఎంపిహెచ్‌ఎస్‌ ఉద్యోగులను కోరిన స్థానాలకు బదిలీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ బదిలీ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ సదరు ఉద్యోగత్రయానికి పట్టకపోవడం గమనార్హం. ఇప్పటికైనా జోన్‌- 4 పరిధిలో కొంతకాలంగా నడుస్తున్న విపరీత ధోరణుల్ని నిలవ రించాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.
రాజకీయ ఒత్తిడులు వాస్తవమే
ఎంఎల్‌హెచ్‌పి ఉద్యోగుల బదిలీలు చేయాలని రాజకీయ ఒత్తిడులు వచ్చిన మాట నిజమే. ఉద్యోగుల బదిలీ ఫైలుపై సంతకం చేయాలి కదా, ఎటు వంటి బదిలీలు చేయలేదు. అయినప్పటికీ మరోసారి పరిశీలన చేస్తా.
- డాక్టర్‌ అనిల్‌కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ రీజినల్‌ డైరెక్టర్‌, కడప.