ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో ఆవు మాంసం ఉందనే కారణంతో 2015లో మహమ్మద్ ఆఖ్లఖ్ పై మూక దాడి చేసి, హత్య చేసిన తీరు...ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీల దాకా విస్తరించింది. ఆ దాడిలో హంతకులతో పాటు, గోవధ చేశాడనే నెపంతో బాధితుడైన ఆఖ్లఖ్ పైన కూడా కేసు నమోదు చేశారు. అలాంటి అనేక ఘటనల్లో పోలీసుల వ్యూహం (దాడి చేసిన వారితో పాటు బాధితులపై కూడా కేసు నమోదు చేయడం) అదే రీతిలో కొనసాగుతున్నది.
మితవాద అల్లరిమూకలు లాఠీలు, ఇనుపరాడ్లు, త్రిశూలాలు పట్టుకుని క్రైస్తవులను ఆటంకపరచి, ఆస్తులను ధ్వంసం చేసి గాయపరుస్తారు. పోలీసులు, దాడి చేసిన వారితో పాటు మత మార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితులపైన కూడా కేసులు నమోదు చేస్తారు. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యుసిఎఫ్) గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం భారత దేశంలో ఇలాంటివి 305 సంఘటనలు జరిగాయి. ప్రధాని నియోజకవర్గమైన వారణాసి, ప్రయాగ్ రాజ్ (అలహాబాద్), నోయిడా, అయోధ్య, రాంపూర్, బారైచ్, లఖింపూర్ ఖేరి లలో ఇలాంటి ఘటనలు జరిగినట్టు నివేదికలున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని మావ్ జిల్లా, ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 'ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి వ్యతిరేక చట్టం ముస్లింలతో పాటు క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. అల్లరిమూక లాఠీలు పట్టుకుని ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, అప్పుడప్పుడు పోలీసులను వెంట తీసుకుని చర్చిలకు వస్తారు. ప్రార్థనలను ఆటంకపరచి, పాస్టర్‌ను కొట్టి, చర్చిని ధ్వంసం చేసి, బైబిల్‌ను అపవిత్రం చేస్తారు. పోలీసులు దాదాపుగా అన్ని సందర్భాల లోనూ మౌనం వహిస్తున్నారు. పోలీసులు, బజరంగ్దళ్ (హిందూత్వ సైన్యం)తో పాటు పాస్టర్, బాధితుల పైన కూడా కేసులు నమోదు చేసి, బాధితులకు జరిమానాలు విధిస్తార'ని జాన్ దయాళ్ అనే కార్యకర్త చెప్పాడు.
రూర్కీ సంఘటన
అక్టోబర్ 3వ తేదీన రూర్కీలో 200 మందికి పైగా వున్న అల్లరిమూక ఓ చర్చి లోకి ప్రవేశించి, ఆస్తులను ధ్వంసం చేసి, ఆదివారం ప్రార్థనలకు వచ్చిన వారిపైన దాడి చేసింది. ఆ సమయంలో కేవలం 12 మంది మాత్రమే చర్చిలో ఉన్నారు. ఈ మూకకు నాయకత్వం వహించిన 50 సంవత్సరాల వ్యక్తి చర్చి పాస్టర్ కుమార్తె భుజం పట్టుకోగా, మరొకడు ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అల్లరి మూక లోని మహిళలు ఆ అమ్మాయి చెంప మీద కొట్టి, ఆమె మొబైల్ దొంగిలించారు. చర్చి సహాయకుడైన రాజ్ కుమార్‌ను మెడ పట్టుకొని కిందకు లాక్కెళ్ళి మొఖం, వీపు మీద పిడి గుద్దుల వర్షం కురిపించారు. అంతటితో ఆగక తలపై రాడ్‌తో కొట్టారని మానవ హక్కుల సంఘాల కార్యకర్తలకు అతడు చెప్పాడు.
చర్చి చట్ట విరుద్ధంగా నడుస్తున్నదని అల్లరి మూకలు ఆరోపించాయి. ఆ ఆరోపణలను కొట్టివేస్తూ, సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద 'ఫుల్ గాస్పెల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా' సంస్థకు అనుబంధంగా ఉందని పాస్టర్ చెప్పారు. తన వాదనను బలపరుస్తూ భూమి అగ్రిమెంట్‌ను నిజ నిర్ధారణ బృందానికి అందజేశాడు.
ఈ మూకదాడి జరగడానికి ముందే ఇలాంటి అనుమానాస్పద చర్యలను గురించి చర్చి పోలీసులకు నాలుగు పర్యాయాలు తెలియపరిచింది. వారికి అపరిచిత వ్యక్తుల నుంచి విద్వేషం నిండిన క్రైస్తవ వ్యతిరేక బెదిరింపులు వచ్చాయి. మత మార్పిడులు చేస్తున్నారని ఆరోపిస్తూ, వారిపై హింసాత్మక బెదిరింపులకు పాల్పడ్డారు. 'నేను ఎస్పీకి ఈ విషయమై మెయిల్ పంపించడమేగాక, అక్టోబర్ 2న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. వారు మాకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఎలాంటి సహాయం అందలేదు. దాడి జరిగిన రోజు కూడా మేం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. కానీ అల్లరిమూక విధ్వంసం పూర్తయ్యాక గంటకు పోలీసులు వచ్చార'ని పాస్టర్ కుమార్తె చెప్పింది. పోలీస్ స్టేషన్, చర్చి నుంచి ఒక కిలోమీటర్ లోపు దూరమే ఉంటుంది. పోలీసులు రావడానికి ముందు వారు సిసిటివి ఫుటేజ్‌ను, మత చిహ్నాలను ధ్వంసం చేసి, చర్చిలో 'జై శ్రీరామ్', 'హరహర మహాదేవ్' లాంటి నినాదాలు చేశారు.
మావ్ సంఘటన
బజరంగ దళ్, హిందూ యువ వాహిని లాంటి హిందూత్వ అల్లరిమూకలు అక్టోబర్ 10వ తేదీన ప్రార్థనలకు వచ్చిన క్రైస్తవులపై దాడి చేశాయి. పాస్టర్‌తో పాటు అక్కడికి వచ్చిన వారిని తమతో పోలీస్ స్టేషన్‌కు రావాలని అల్లరిమూక ఒత్తిడి చేసింది. కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘిస్తూ, మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ క్రైస్తవులపై రాధే శ్యాం అనే వ్యక్తి కేసు పెట్టాడు. అదేరోజు మావ్‌లో వేరే ప్రాంతంలో, హిందూ జాగరణ్ మంచ్ జిల్లా ప్రతినిధి భానుప్రతాప్ సింగ్, ప్రజల మతాన్ని మార్చేందుకు పాస్టర్ ఒక ఇంట్లో ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేశాడని ఆరోపిస్తూ కేసు పెట్టాడు. పోలీసులు పాస్టర్ అబ్రహం షకీల్ అహ్మద్, అతని భార్య ప్రతిభతో పాటు ప్రార్థన నిర్వహించబడిన ఇంటి యజమాని విజేంద్ర రాజ్‌భర్, అతని భార్య గీతాదేవి ని అరెస్టు చేశారు. వారి ప్రకటనలు భిన్నంగా ఉన్నప్పటికీ, వారిని 'ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ రెలిజియస్ కన్వర్షన్ ఆర్డినెన్స్ 2020' కింద కేసు నమోదు చేశారు.
అక్టోబర్ 12న మావ్‌లో జరిగిన మరొక సంఘటనలో, మతమార్పిడులకు పూనుకుంటున్నారని ఆరోపిస్తూ, హిందూత్వ అల్లరి మూక ఇద్దరు క్రైస్తవ నన్ లను కొట్టి, వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్ళింది. అల్లరిమూక దాడి చేసినప్పుడు మీర్పూర్ క్యాథలిక్ మిషన్‌కు చెందిన ఒక పాఠశాల ప్రిన్సిపల్ అయిన సిస్టర్ గ్రేసీ మాంటెయిరో, ఆమె సహోద్యోగి సిస్టర్ రోష్నీ మింజ్‌లు కారులో ఉన్నారు. 'నేను, (తన తండ్రిని చూసేందుకు రాంచీ వెళ్తున్న) సిస్టర్ మింజ్ వెంట ఉన్నాను. మింజ్, రాంచీ వెళ్లే వాహనం గురించి తెలుసుకునేందుకు మావ్ బస్‌స్టేషన్ లోకి వెళ్లినపుడు, నేను, డ్రైవర్ కారులో ఉన్నాం. తరువాత అల్లరిమూక వచ్చి డ్రైవర్ మీద దాడి చేసి, బయటకు లాగి, పోలీస్ స్టేషన్ వరకు నడవాలని మమ్ముల్ని ఒత్తిడి చేశార'ని సిస్టర్ మాంటెయిరో నిజనిర్ధారణ బృందానికి చెప్పింది.
మత మార్పిడులకు పూనుకుంటున్నారని ఆరోపణలు చేస్తూ ఉత్తరప్రదేశ్ లోని షాజాహాన్‌పూర్‌లో 20 మంది క్రైస్తవులపై జనవరి 3న మితవాద తీవ్రవాదులు మొదలుపెట్టిన దాడుల కొనసాగింపే రూర్కీ, మావ్లలో జరిగిన దాడులు కూడా. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఆస్తులను ధ్వంసం చేసి, క్రైస్తవులను గాయపరిచిన తరువాత, వారు ఆరోపిస్తున్న మత మార్పిడుల గురించి పోలీసులకు తెలపడంతో, పాస్టర్‌ను, ముగ్గురు క్రైస్తవులను అరెస్ట్ చేశారు.
తరువాత నెలలో అదే రీతిలో, కాన్పూర్‌లో జరుగుతున్న ఒక చర్చి సమావేశాన్ని ఆటంక పరిచారు. క్రైస్తవ మతంలోకి మారడానికి పాస్టర్, పంకజ్ మాలిక్ ప్రజలకు ఆర్థిక ప్రోత్సాహకాలను ఇవ్వజూపుతూ, మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. దాడి చేసిన నేరస్తులు పోలీసులను పిలవగా వారు పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఒక నెల తరువాత, బరెయిలీ లోని మెథాడిస్ట్ చర్చి గోడలను నేలమట్టం చేశారు. ఫిబ్రవరిలో అంబేద్కర్ నగర్‌లోని తన నివాసంలో ఆదివారం ప్రార్థనలు చేస్తున్న పాస్టర్ అంజీత్ కుమార్‌ను, ఇంట్లోకి చొరబడి మత మార్పిడులకు పాల్పడుతున్నాడని తిట్టారు. ఆయనకు ప్రైవేట్‌గా ఆరాధించే అనుమతి ఉన్నప్పటికీ, ప్రార్థనల కోసం ఎవరినీ ఆహ్వానించకుండా పోలీసులు నిషేధించారు.
కొన్ని రోజుల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో, పాస్టర్ జితేంద్రవర్మ ప్రార్థనా సమావేశాన్ని నిర్వహిస్తుండగా, ఒక అల్లరిమూక ఒక పోలీసు కానిస్టేబుల్‌తో వచ్చి, ప్రార్థన చేసుకుంటున్న వారిని తిట్టడం మొదలెట్టారు. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయనే ఆరోపణలు మళ్ళీ తెర పైకి తెచ్చారు. కాన్పూర్, ఆగ్రా, బిజ్నోర్, అజమ్గఢ్, రాంపూర్, ఔరియా, మహారాజ్ గంజ్, జాన్పూర్లలో ఇదే విధమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని నివేదికలున్నాయి.
ప్రధానంగా మీడియా ఈ దాడుల గురించి తెలియ చేయకుండా దాటేస్తున్నది. ప్రజల దష్టికి వచ్చిన విషయాలన్నీ పోలీసులు తమదైన శైలిలో చెప్పిన విషయాలే. 'ప్రభుత్వం చెప్పినట్టు మీడియా చేస్తుంది.
ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ దాడులన్నీ చెదురుమదురుగా జరిగినవేనని ప్రభుత్వం చెపుతున్నది. ఇది పచ్చి అబద్ధం. కెనడాలో ఒక సిక్కు, న్యూయార్క్‌లో ఒక హిందువు దాడికి గురైతే, ప్రధానమంత్రితో పాటు ప్రతి ఒక్కరు ఆ దాడులను ఆక్షేపిస్తారు. కానీ మన భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులపై పదుల వందల సంఖ్యలో జరుగుతున్న దాడులపై మీడియా మాత్రం ఆసక్తి చూపదు. ఇటీవల కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల లో గానీ, ఉత్తరప్రదేశ్ విధానసభలో గానీ ఈ దాడుల గురించి ఎటువంటి ప్రస్తావన లేద'ని జాన్ దయాళ్ అన్నాడు.
మైనారిటీలపై జరుగుతున్న దాడుల క్రమంలోనే, ప్రస్తుతం క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల 'యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్', యుసిఎఫ్ తో కలిసి ఎపిసిఆర్ ఒక పత్రికా సమావేశం నిర్వహించింది. భారతదేశంలో ఈ సంవత్సరం మొదటి 273 రోజుల్లో నమోదైన 305 హింసాత్మక ఘటనలలో అత్యధికం ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ లోనే చోటుచేసుకున్నాయి. 'క్రైస్తవులు చాలా పెద్ద ఎత్తున మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు కానీ, వారి సంఖ్యను చూసినప్పుడు దానికి భిన్నంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ జనాభా సంఖ్య తగ్గుతున్న విషయాన్ని గమనించాలని 'యూనిటీ ఇన్ కంపాషన్' అధ్యక్షురాలు మీనాక్షీ సింగ్ వ్యాఖ్యానించారు.
మత మార్పిడులకు వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. 'మైనారిటీల చిహ్నాలైన శిలువ, బైబిల్, ఖురాన్లపై గూండాలు దాడులకు పాల్పడి అపవిత్రం చేసి, వాటిని ధ్వంసం చేస్తున్నారు. దాడులు చేసిన వారికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేసే క్రమంలో మౌల్వీలను, పాస్టర్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నార'ని దయాళ్ వెల్లడించాడు.

జియా ఉస్ సలామ్
('ఫ్రంట్‌లైన్' సౌజన్యంతో)










