
- అంతకంతకూ తగ్గుతున్న ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం
- ప్రతి ఏటా లక్షల ఎకరాలు బీడు
- గిట్టుబాటు ధర లేకపోవడమే కారణం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం కాగా గడచిన తొమ్మిదేళ్లలో సేద్యం అంతకంతకూ తగ్గుతోంది. పంటల సాగులో ఖరీఫ్ అత్యంత కీలకం. 70 శాతం సాగు ఈ కాలంలోనే సాగుతుంది. విభజన తర్వాత పది ఖరీఫ్ సీజన్లు రాగా క్రమేపి పంటల సగటు సాధారణ సాగు విస్తీర్ణం దిగజారుతోంది. ఇదే సమయంలో యేటికేడు పంటల సేద్యమూ క్షీణిస్తోంది. కరువు కాటకాలు తుపాను వరదల వంటి ప్రకృతి విపత్తులతో నిమిత్తం లేకుండా సాగు తగ్గడం కొత్త ధోరణి. ఐదేళ్ల పంటల సాగు ప్రాతిపదికగా సాధారణ నార్మల్ విస్తీర్ణం నిర్ణయిస్తారు. ఏడాదేడాదీ నార్మల్ విస్తీర్ణం పడిపోతుండగా అందులోనూ లక్షల ఎకరాల్లో సాగు లేక బీడు పడుతున్నాయి. 2014లో 105 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం ఉన్నదికాస్తా 2023 కొచ్చేసరికి 86 లక్షల ఎకరాలకు తగ్గింది. ఇదే సమయంలో పంటల సాగు 99.65 లక్షల ఎకరాల నుంచి 60.22 లక్షల ఎకరాలకు కుంచించుకుపోయింది. దశాబ్ద కాలంలో ఇన్నేసి లక్షల ఎకరాల్లో సాగు తగ్గడం ఆందోళన కలిగించే అంశం. సాగు యోగ్యమైన భూమి ఖాళీ పడటం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం. సంక్షోభానికి సంకేతం. ప్రతేడాది లక్షల ఎకరాలు బీడు పడటం ఆహార భద్రతకు, ప్రజల జీవనోపాధికి ప్రమాద ఘంటిక.
- పాదుకుంటున్న కొత్త ధోరణి
కరువొచ్చినప్పుడు పంటల సాగు తగ్గడం కద్దు. పుష్కలంగా వర్షాలు కురిసినప్పుడూ, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తొణికిసలాడినప్పుడూ, సమృద్ధిగా భూగర్బ Ûజలాలున్నప్పుడు సైతం లక్షల ఎకరాల్లో సాగు భూములు ఖాళీ పడుతున్నాయి. పది ఖరీఫ్ సీజన్లలోకెల్ల 2020 కాస్త ఆశాజనకంగా ఉంది. కానీ ఆ సంవత్సరం కూడా నార్మల్‌లో ఆరేడు లక్షల ఎకరాల్లో సేద్యం జరగక బీడు పడ్డాయి. 2014లో 5.35 లక్షల ఎకరాలు, 2015లో 15.19 లక్షల ఎకరాలు, 2016లో 5.85 లక్షల ఎకరాలు, 2017లో 16.30 లక్షల ఎకరాలు, 2018లో 11.92 లక్షల ఎకరాల్లో సాగు లేదు. అవన్నీ కరువు సంవత్సరాలు. రాష్ట్రంలో ఏదొక మూలన గణనీయంగా కరువు మండలాలు ప్రకటించారు.
కాగా 2019 నుంచి వరుసగా నాలుగేళ్లపాటు పుష్కలంగా వానలు కురి శాయి. అయినా 2019లో 11.28 లక్షల ఎకరాలు, 2020లో 6.73 లక్షల ఎకరాలు, 2021లో 10 లక్షల ఎకరాలు, 2022లో 9.23 లక్షల ఎకరాలు, 2023లో దాదాపు 26 లక్షల ఎకరాల్లో విత్తనం పడలేదు.
- అన్ని పంటలదీ అదే వరస
ఆహార ధాన్యాలు, నూనెగింజలు, వాణిజ్య పంటలు ఒకటేమిటి అన్ని పంటల సాగు గణాంకాల గ్రాఫ్ కిందికే. 2014ల నుంచీ ఆహార ధాన్యాల నార్మల్ విస్తీర్ణం 50 లక్షల ఎకరాల వద్ద కునారిల్లు తుండగా సాగు 47.67 లక్షల ఎకరాల నుంచి 40.45 లక్షల ఎకరాలకు దిగజారింది. ఆహార పంటల్లో వరి నార్మల్ 37 లక్షల ఎకరాలకు అటూ ఇటుగా ఉంది. సాగు మాత్రం 35.37 లక్షల ఎకరాల నుంచి 31.65 లక్షల ఎకరాలకు తగ్గింది. ఈ కాలం లో నూనెగింజల సాగు బాగా క్షీణించింది. అందుకు వేరుశనగ తగ్గడమే కారణం. నూనె గింజలు నార్మల్ 20.55 లక్షల ఎకరాల నుంచి 17.40 లక్షల ఎకరాలకు దిగజారింది. సాగు 2020లో అత్యధికంగా 19 లక్షల ఎకరాల్లో కాగా ప్రస్తుతం 8.8 లక్షల ఎకరాలకు పరిమితమైంది. నూనె గింజలు ఇంతగా తగ్గడం ఇప్పుడే.

- ఎంతో చేశామంటున్న ప్రభుత్వాలు
ఈ సమయంలో టిడిపి ప్రభుత్వం రైతులకు కొద్ది మేర రుణ మాఫీ చేసింది. వైసిపి సర్కారు రైతు భరోసా పేరిట కొంత మొత్తంలో స్వంత భూమి కలిగిన రైతాంగానికి నగదు బదిలీ చేసింది. కౌలు రైతులకు ఇస్తామన్నా నామమాత్రంగానే ఇచ్చింది. రెండు ప్రభుత్వాలూ ఉచిత విద్యుత్‌ను కొనసా గించాయి. అయినప్పటికీ సాగు కుదించుపోతోంది. పండించిన పంటలకు ధరలు గిట్టుబాటుకాక, పెట్టు బడులు పెరిగి, సంస్థాగత పరపతి దొరక్క, ప్రైవేటు రుణాలపై ఆధారపడి, విపత్తుల సమయం లో బీమా, పరిహారం అందక, నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగుమందుల బెడదతో రైతాంగం తమ జీవనోపాధి అయిన సాగును సాగించలేకపోతున్నారు. ఈ ఏడాదిని పక్కనపెడితే నిరుటి వరకు ప్రాజెక్టుల్లో నీరున్నా నెల్లూరు వంటి చోట్ల రైతులు వరి వేయడానికి ముందుకు రాలేదు. కోనసీమలో క్రాప్ హాలిడే దుష్ప్రచారం అడపాదడపా ముందుకొస్తోంది. రాయలసీమలో రైతులు పంటలు వేయకుండానే ఇ-క్రాప్‌లో నమోదు చేయించుకొనే ధోరణి అక్కడ క్కడ కనిపిస్తోంది. వ్యవసాయ భూములు వ్యవసాయేతరానికి మార్పు చెందడం వలన నార్మల్ తగ్గుతోందన్న వాదనలో పస లేదు. రైతులు తమ ప్రాంతాల్లో సంప్రదాయంగా పండించే పంటల నుంచి వేరే పంటలకు మళ్లడం వలన సాగు తగ్గిందన డమూ అంతగా నొప్పదు. ఆ మేరకు సాగు పెరగకపోవడమే కారణం.