ఇరవయ్యవ వార్షికోత్సవంలో సేవ, సమర్పణ అంటే ఆరెస్సెస్ సేవ, కార్పొరేట్‌కు సమర్పణ మాత్రమే! కరోనా తాకిడితో తల్లడిల్లిపోయిన వేళ కూడా మోడీ సర్కారు కార్మికుల పట్ల ఉపేక్ష, కార్పొరేట్లకు చేయూత, తబ్లిగీ జమాత్ వంటి ప్రచారాలు సాగించిందని మర్చిపోరాదు. ఇదే సమయంలో దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పూర్తిగా ట్రంప్‌కు తాకట్టు పెట్టి అమెరికా కూటమికి తోకగా మార్చారు. దేశంలో రాజకీయ అవసరాలకు గాను కుహనా దేశభక్తిని సరిహద్దులలో కృత్రిమ ప్రజ్వలనలను సాకుగా ముందుకు తెచ్చారు. మరో వంక అన్నీ ఆయన వచ్చాకే జరిగాయనే అతిశయోక్తులు, అసత్య ప్రచారాల కోసం అన్ని సాధనాలనూ వాడుకున్నారు. తన విజయానికి మీడియా సోషల్ మీడియాలే సోపానం చేసుకున్న మోడీ గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో మీడియాతో మాట్టాడనే లేదు. ఇవన్నీ కపటత్వానికి మచ్చుతునకలు.
మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలై ప్రధాని పీఠం చేరిన నరేంద్ర మోడీ పాలనాధికారం ఇప్పటికి ఇరవయ్యేళ్లు అయిందని బిజెపి వేడుకలు చేస్తుంటే మీడియా కూడా ముందస్తు కథనాలు ప్రచురిస్తున్నది. మొన్న అక్టోబర్ ఏడు నాటికి 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రి గానూ, ఏడేళ్లు ప్రధాని గానూ ఆయన ఈ రెండు పదవుల్లో కలసి ఈ విధంగా ఇంత సుదీర్ఘకాలం మరెవరూ వుండలేదని కూడా కథనాలు వస్తున్నాయి. మోడీ ఏది చేసినా అందులో మిస్టరీ ట్విస్టరీ వుంటుందని అంటుంటారు. ఇందులో కూడా అలాంటి చమత్కారమే వుంది. ముఖ్యమంత్రిగా మాత్రమే చూస్తే జ్యోతిబాసు, నవీన్ పట్నాయక్ వంటివారు ఆయన కంటే చాలా ఎక్కువ కాలం వున్నారు. ప్రధానిగా తీసుకుంటే జవహర్‌లాల్ నెహ్రూ (6175 రోజులు), ఇందిరా గాంధీ (5829 రోజులు), మన్మోహన్ సింగ్ (ఇప్పటికి) పదవీ కాలం ఎక్కువ. అయితే రెంటినీ కలిపితే మాత్రం మోడీనే ఎక్కువ. అందులోనూ ముఖ్యమంత్రులుగా వుండి ప్రధానులైన వారు చాలామంది వున్నారు. నేరుగా అక్కడ రాజీనామా చేసి ఇక్కడకు వచ్చిన వారూ వున్నారు. కాని వారి పదవీ కాలం చాలా తక్కువ. ఒక్క పి.వి నరసింహారావును మినహాయిస్తే వారెవరూ మూడో ఏట ప్రవేశించింది లేదు. మోడీ ముఖ్యమంత్రిగా 12 ఏళ్ల 227 రోజులున్నారు. ప్రధానిగా ఇప్పటికి 2671 రోజులు పూర్తి చేసుకున్నారు. ఆ విధంగా ఇది అరుదైన రికార్డు. ఈ మొత్తం కాలంలో మోడీ పాలనా రికార్డు, రాజకీయ రికార్డు కూడా మరెవరికీ లేనంత ఏకపక్షంగానూ వివాదాస్పదంగానూ వుండటం మరో వాస్తవం. పి.పి (ప్రచారక్ ప్రధాని)గా మొదలైన ఆయన పిపిపి (పరివార్‌్ ప్రైవేటు పార్టనర్‌షిప్) అర్థమే మార్చివేసి దేశానికి కాషాయ కార్పొరేట్ కూటమి పాలన పరాకాష్ట ఎలా వుంటుందో చూపిస్తున్నారు. మోడీని బి.సి నాయకుడిగా చూపడమంటే బిగ్ కార్పొరేట్ అనే అర్ధంలో తీసుకోవలసి వుంటుంది. ఇరవయ్యేళ్ల అధికార వేడుక జరిపే వేళ వెనక్కు తిరిగి చూస్తే మరెవరికీ జరగని రీతిలో మోడీనే దేశాధినేత కావడం ఎలా జరిగిందో అర్ధమవుతుంది.
గుజరాత్ కథ ఏమిటి ?
గుజరాత్ లోని ఒక ప్రాంతంలో ఆరెస్సెస్ ప్రచారక్‌గా వున్న మోడీ ఎమర్జన్సీ తర్వాత సంఫ్‌ు చరిత్ర, పరిశోధన రచన విభాగంలో ప్రవేశించారు. ఎమర్జన్సీలో తమ పాత్ర రాసే బాధ్యత అప్పగించారు (అందుకే మోడీ పదే పదే ఆ ఘట్టం గురించి చెబుతుంటారు). తర్వాత తనను నెమ్మదిగా బిజెపి రాజకీయ బాధ్యతలు చూసేందుకు పంపించారు. ఆ క్రమంలో మొదట గుజరాత్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పట్టు పెంచుకున్నారు. ఎల్.కె అద్వానీ రథయాత్ర గుజరాత్ లోని సోమనాథ్ నుంచి ప్రారంభమై అయోధ్య చేరేవరకూ బాధ్యతలు చూసింది మోడీనే. తర్వాత అధ్యక్షుడైన మురళీ మనోహర్ జోషి కాశ్మీర్‌కు జరిపిన ఏక్‌తా యాత్ర లోనూ పని చేశారు. అద్వానీ హయాంలోనే జాతీయ కార్యదర్శులలో ఒకరుగా నియమితులైనారు. వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ముఖ్యమంత్రి కేశూభారు పటేల్, ఎం.పి శంకర్ సింగ్ వఘేలా మధ్య వివాదంలో చిక్కిన గుజరాత్‌లో సయోధ్య కోసం మోడీని పంపించారు. వఘేలా కాంగ్రెస్‌లో చేరాక కేశూభారు అనారోగ్యం, అసమర్థత కారణాలుగా చూపి మోడీకి పగ్గాలు అప్పగించారు. బిజెపి ని వరుసగా ఎన్నుకున్న ఏకైక రాష్ట్రమైన గుజరాత్‌ను నిలబెట్టుకోవాలన్న తాపత్రయం తోనే అధిష్టానం ఆయనను ఎంపిక చేసింది. పాలనా రంగంలో ఏ బాధ్యతలు అనుభవం లేకుండానే మోడీ ఎకాఎకిన ముఖ్యమంత్రి అయ్యారు.
మారణహోమం..మెచ్చిన పరివారం
2001 ఫిబ్రవరి 21న గోద్రాలో రైలు పెట్టె దహనంతో దవానలంలా మతచిచ్చు రగిలింది. తర్వాత కొద్ది రోజులకు జరిగిన మత మారణకాండలో కనీసం రెండు వేల మంది ముస్లిములు ప్రధానంగా ప్రాణాలు కోల్పోయారు. దేశ విభజన, సిక్కులపై ఊచకోత తర్వాత ఎన్నడూ ఎరగని రీతిలో ఈ జాతి హత్యాకాండ జరుగుతుంటే ముఖ్యమంత్రి మోడీ ఉపేక్ష వహించారని, వాస్తవానికి ప్రేరేపించారని కూడా అనేక కథనాలు వచ్చాయి. ప్రపంచ వ్యాపితంగా నిరసన వ్యక్తమైంది. ఈ విమర్శల ధాటికి అప్పటి ప్రధాని వాజ్‌పేయి మోడీని ఆ పదవి నుంచి తప్పించాలని గోవాలో జరిగిన తమ జాతీయ కార్యవర్గంలో ప్రతిపాదించారు. అయితే అప్పటికే సంఘ పరివార్ వ్యవస్థలోనే గాక రాజకీయ ఆర్థిక వర్గాలలో మోడీ ఎంతగా పాతుకుపోయారంటే వాజ్‌పేయి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అద్వానీ శిబిరం పూర్తిగా మోడీని మోసింది (ఆ అద్వానీ పరిస్థితి తర్వాత ఏమైందనేది అందరికీ తెలుసు). ఇరవయ్యేళ్లు పూర్తి చేసుకోవడంలో విస్మరించరాని ఘట్టాలివి. ఆ జాతి హత్యాకాండ సృష్టించిన కల్లోలం మధ్యనే అందరూ వ్యతిరేకిస్తున్నా పెడచెవిని పెట్టి మోడీ ముందస్తుగా 2002లో ఎన్నికలు జరిపి మరోసారి విజయం సాధించారు. ఇదే సంఘ పరివార్ దృష్టిలో మోడీ సమర్థత అయింది. మీడియాలో ప్రశ్నలు ఎదుర్కోలేని మోడీ టీవీ చర్చల నుంచి లేచిపోతుంటే గుజరాత్ ప్రభుత్వం ఆయన విజయాలను టముకు వేస్తూ వచ్చింది. 2004లో దేశం వెలిగిపోతోంది ప్రచారంతో హడావుడి చేసినా వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోయి యుపిఎ-1 అధికారం చేపట్టింది. ఆ సమయంలో మోడీ వారికి మరింత కీలకంగా మారారు. వారిని మెప్పించే విధంగా మతతత్వ రాజకీయం సాగిస్తూనే మోడీ 2007లో గెలిచిన తర్వాత కార్పొరేట్లను మెప్పించడంపై దృష్టి పెట్టారు. మామూలుగానే భారతదేశంలో పారిశ్రామిక రాజధానులుగా పేరొందిన మహారాష్ట్ర, గుజరాత్ లపై వారికి ప్రత్యేక ఆసక్తి. మోడీ కార్పొరేట్లకు పూర్తిగా తాళాలు అప్పగించడంతో వారూ ఆయనను ఆకాశానికెత్తడం మొదలుపెట్టారు. ఇది చాలక ఎన్‌ఆర్‌ఐ సదస్సులతో విదేశీ కంపెనీల ఆశీస్సులూ పొందగలిగారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సులు అట్టహాసంగా తయారైనాయి. 2012 ఎన్నికలలో మోడీ అత్తెసరు మెజార్టీతోనే గెలిచినా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బిజెపికి జాతీయ ప్రతీక అయ్యారు. ఈ కాలంలో నిజంగా గుజరాత్ మానవాభివృద్ధి సూచికలన్నిటా వెనకబడి వున్నా ఏదో సాధించారనే హడావుడి దాన్ని మరుగుపర్చింది.
జాతీయ యవనిక పైకి అంబానీల ఆశీస్సులతో
2009 లోనూ రెండవసారి ఓడిపోయాక, అద్వానీకి దేశాన్ని ఆకట్టుకునేంత ఆకర్షణ లేదని తేలడంతో మూడుసార్లు ముఖ్యమంత్రి గుజరాత్ వైభవ ప్రదాత మోడీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెస్తే కార్పొరేట్ మద్దతు వుంటుందని పరివార్ భావించింది. 2013 వైబ్రంట్ గుజరాత్ సదస్సులో అంబానీ సోదరులు అందుకు ఆధ్వర్యం వహించారు. మోడీ దార్శనితతను ముఖేశ్ అంబానీ ప్రస్తుతించారు. ఆయన తమ్ముడు అనిల్ అంబానీ మరో అడుగు ముందుకేసి మోడీని గాంధీతో పోల్చారు. అప్పటికే కామన్వెల్త్, 2జి తదితర కుంభకోణాలతో రోసిపోయిన యుపిఎ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా ప్రజలను ఆకర్షించేందుకు మోడీని ముందు పెట్టుకోవాలన్న కార్పొరేట్ ఇండియా (ఇండియా ఇంక్ అంటుంటారు) ఉద్దేశానికి వారి మాటలు అద్దం పట్టాయి. ఆరెస్సెస్, బిజెపి లకు కూడా అంతకన్నా కావలసింది లేదు గనక ప్రధానిగా మోడీ ప్రచార ప్రక్రియ మొదలైంది. తన ప్రతి కదలిక, ప్రతి ప్రవచనమూ ప్రచారాస్త్రాలైనాయి. ప్రశాంత్ కిశోర్ మార్కెటింగ్‌లో చారువాలా, సంఫ్‌ువాలా, కార్పొరేట్‌వాలా త్రిమూర్తిగా మోడీనే త్రీడీలో కనిపించాడు. మోడీతో పాటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల తతంగం భారీ కార్పొరేట్ రంగు పులుముకుంది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి వదలిపెట్టి దేశ సారథ్యం చేపట్టారు.
కపట నాటకాలు..కఠోర సత్యాలు
పార్లమెంటు మట్టిని ముద్దాడటంతో మొదలుపెట్టారు. తొలి దశలో స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా వంటి నినాదాలతో జాతిని ఉత్తేజపర్చే నేతగా చూపించబడిన చారువాలా గారువాలా అయ్యారు. స్వచ్ఛ భారత్ కక్ష భారత్‌గా మారింది. అసహన దాడులు నిత్యకృత్యమైనాయి. అధ్యక్ష తరహాను మించేలా ఏకపక్ష పాలనకు పిఎంవో కేంద్రమైంది. న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక సంస్థలు ఇవేవీ స్వతంత్రత నిలుపుకోలేని దురవస్థ. విశ్వవిద్యాలయాలపై విజ్ఞాన కేంద్రాలపై పత్యక్ష దాడి. ఒకే దేశం ఒకే రేషన్, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు ఒకే మతం అన్నట్టు భిన్నత్వంలో ఏకత్వం తలకిందులైంది. ఇదంతా మోడీ వ్యక్తిగత ప్రచారం చాటునే జరిగిందని మర్చిపోకూడదు. ఆరెస్సెస్ చెప్పే హిందూ రాష్ట్ర ఏకీకృత నిరంకుశ స్వభావానికి ఇది అచ్చంగా సరిపోయింది. సమాఖ్య విధానం కాస్త టీం ఇండియా అంటూ మోడీని కెప్టెన్‌ను చేసింది. పేద భారత ప్రతినిధినంటూనే అమెరికా అప్పటి అధ్యక్షుడు ఒబామా కూడా వ్యాఖ్యానించేంత జిలుగు వెలుగు దుస్తులు ధరించి బూట్‌సూట్‌వాలా అనిపించుకున్నారు. మారణహోమాలపై స్పందించలేదు గాని మయూరాలతో గడిపే మహర్షి చిత్రాలు విడుదల చేశారు. కేదారనాథ్ గుహలో తపోభంగిమలో దర్శనమిచ్చారు. మాడిసన్ స్క్వేర్ లోనూ వెలిగిపోయారు. ఇవన్నీ వ్యక్తిగత పోకడలుగానే గాక భిన్న తరగతులను ఆకర్షించే వ్యూహాలుగా చూడవలసి వుంటుంది. ఇన్ని విన్యాసాల మధ్యనా రెండు విషయాలు నిరంతరాయంగా సాగిస్తూ వస్తున్నారు. ఇరవయ్యవ వార్షికోత్సవంలో సేవ, సమర్పణ అంటే ఆరెస్సెస్ సేవ, కార్పొరేట్‌కు సమర్పణ మాత్రమే! కరోనా తాకిడితో తల్లడిల్లిపోయిన వేళ కూడా మోడీ సర్కారు కార్మికుల పట్ల ఉపేక్ష, కార్పొరేట్లకు చేయూత, తబ్లిగీ జమాత్ వంటి ప్రచారాలు సాగించిందని మర్చిపోరాదు. ఇదే సమయంలో దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పూర్తిగా ట్రంప్‌కు తాకట్టు పెట్టి అమెరికా కూటమికి తోకగా మార్చారు. దేశంలో రాజకీయ అవసరాలకు గాను కుహనా దేశభక్తిని సరిహద్దులలో కృత్రిమ ప్రజ్వలనలను సాకుగా ముందుకు తెచ్చారు. మరో వంక అన్నీ ఆయన వచ్చాకే జరిగాయనే అతిశయోక్తులు, అసత్య ప్రచారాల కోసం అన్ని సాధనాలనూ వాడుకున్నారు. తన విజయానికి మీడియా సోషల్ మీడియాలే సోపానం చేసుకున్న మోడీ గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో మీడియాతో మాట్టాడనే లేదు. ఇవన్నీ కపటత్వానికి మచ్చుతునకలు.
డెమోక్రసీ.. ఎత్నోక్రసీ
స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ వాషింగ్టన్ లోని కాటో సంస్థ నివేదిక ప్రకారం ఈ దేశంలో స్చేచ్ఛా సూచిక 2013 కన్నా చాలా దిగజారింది. 2013లో 75వ స్థానంలో వుంటే 2018 నాటికి అది 111కు చేరింది. మానవాభివృద్ధి (యుఎన్‌డిపి) నివేదికలో 129 నుంచి 131కి పడిపోయాము. ఆకలి సూచికలో 94వ స్థానంలో వున్నాము. పత్రికా స్వాతంత్య్రంలో రెండు స్థానాలు తగ్గి 142గా వున్నాము. కేంద్రమే నిర్వహించిన కుటుంబ ఆరోగ్య సర్వే-1 ప్రకారం భారతీయుల పౌష్టికాహారం ఘోరంగా దిగజారింది. తాజా వెనకబాట్లు, సంక్షోభాలు చెప్పకపోయినా దేశం అప్పు కోటి కోట్ల రూపాయలు దాటింది. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా టాటాలకు కట్టబెడితే వారిది వారికే చేరినట్టు చిత్రిస్తున్న ఈ వ్యవస్థకు కావలసింది అదే. దేశంలో ప్రజాస్వామ్యం (డెమోక్రసీ) కాస్త ఎత్నోక్రసీ (జాతి మతస్వామ్యం)గా మారిపోయిందని విమర్శకులు ఆక్షేపిస్తున్న పరిస్థితి. ఇన్ని కఠోర సత్యాల మధ్యనా మోడీని మించిన మొనగాడు లేడని చెప్పడానికి మొన్నటి పుట్టిన రోజు చాలక ఈ ఇరవయ్యేళ్ల సంబరం! బహుపరాక్ భారతీయులారా!!
తెలకపల్లి రవి











