Nov 08,2020 09:45

         గోపీ మూడేళ్ల నుంచి వెతుకుతూనే ఉన్నాడు. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు; వీధీవీధీ, అందులోని సందుసందూ వెతుకుతూనే ఉంటాడు. బుజ్జిబుజ్జి కుక్కపిల్లలు ఎక్కడ కనపడినా వదలడు. వాటి తల్లిని ఎలాగైనా ఏమార్చి.. వాటిని చేతుల్లోకి తీసుకుంటాడు. ఒక్కొక్క దానిని వీపు నిమురుతూ కాలివేళ్లు లెక్కపెడతాడు. ముందుకాళ్లు రెంటికీ సాధారణంగా ఐదేసి వేళ్లూ, గోళ్లు ఉంటాయి. వెనుక కాళ్ల దగ్గరే సమస్య. నాలుగేసి వేళ్లే ఉంటాయి. వాటికి నాలుగే గోళ్లుంటాయి. తనకు కావాల్సింది ఇరవై గోళ్ల కుక్కపిల్ల. అంటే - వెనక కాళ్లకూ ఐదేసి గోళ్లు ఉండాలి. ఉంటే ఏమిటి ఉపయోగం? అంటే- ఏమి ఉపయోగమో తెలియదు. ఇరవై గోళ్ల కుక్కపిల్లను పెంచుకోవటం గొప్ప. ఇరవై గోళ్ల కుక్కపిల్లను వెంట తిప్పుకోవటం గొప్ప. గోపీ గాడి కుక్కపిల్లకు ఇరవై గోళ్లంట... అని అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉంటే- వినటం గొప్ప.
అప్పుడే చిన్నా వీధి చివర్లో కనిపించాడు. వాడికీ అదే పని. ఇద్దరూ మంచి స్నేహితులే! ఇద్దరూ చదువుతున్నది ఆరో తరగతే! ఇద్దరికీ కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. అందులోనూ ఇరవై గోళ్ల కుక్కపిల్ల అంటే మరీ ఇష్టం.
        'గోపీ... అంకంరెడ్డోళ్ల వీధిలోని కర్రి కుక్క ఈ పొద్దున్నే ఎనిమిది పిల్లలను పెట్టింది. చూద్దామంటే- అసలు దగ్గరకు రానీయటం లేదు.' అన్నాడు చిన్నా. వాడూ ఇరవై గోళ్ల కుక్కపిల్ల కోసమే వెతుకుతున్నాడు. ఎవరికి వాళ్లే ముందుగా కుక్కపిల్లను సంపాదించాలన్న ఉబలాటంతో ఉన్నారు. ఊళ్లో ఈ ఏడాది ఇప్పటిదాకా తొమ్మిది కుక్కలు ఈనాయి. వాటి పిల్లలు వేటికీ ఇరవై గోళ్లు లేవు. మిగిలింది ఈ కర్రికుక్క ఒక్కటే! అదిప్పుడు ఈనింది. దాని పిల్లలను చూడాలి. ఏమో, దాని దగ్గర ఇరవై గోళ్ల కుక్కపిల్ల దొరుకుతుందేమో! కానీ, చిన్నా గాడు పోటీ. ఆ పిల్లల్లో ఇరవై గోళ్లది ఉంటే- ముందు వాడికి దొరికితే - ఈ ఏడాదీ తన ఆశ నెరవేరనట్టే !

     ఆ రాత్రి గోపీకి సరిగ్గా నిద్ర పట్టలేదు. మధ్యమధ్యలో నిద్ర వచ్చినా - ఆ నిద్ర నిండా కుక్కపిల్లల కలలే! ఒక కుక్కపిల్లకు ఇరవై గోళ్లు ఉన్నట్టు, దానితో తాను ఆనందంగా ఆడుకుంటున్నట్టూ ... కల! ఆ కల నిజం కావాలని ఇంకా తెల్లారకముందే లేచాడు గోపి. నెమ్మదిగా అంకంరెడ్డోళ్ల వీధిలోకి వెళ్లాడు. కర్రికుక్క ఉండే సందులోకి వెళ్లాడు. కర్రికుక్క ఇంకా అక్కడే ఉంది. పిల్లలు గునగునలాడుతూ దాని పొదుగులో పాలు తాగుతున్నాయి. సందు అవతలి వైపు ఎవరో నక్కి నక్కి కూచున్నారు. ఇంకెవరు? చిన్నాగాడే! తన కన్నా ముందే వచ్చి కూచున్నాడు. తల్లి కుక్క అప్పుడే పైకి లేచింది. ఆహారం కోసం బయటకు వెళుతుంది. అటు చిన్నా, ఇటు గోపి ఉన్నారు. అనుమానంగా చూసి, గట్టిగా అరిచింది. కనిపెట్టేసింది అనుకొని ఇద్దరూ పక్కకు తప్పుకొని, వీధిలోకి వచ్చారు.
      'ఏరా.. ఇంత పొద్దున్నే వచ్చేశావు?' అనడిగాడు గోపి.
      'సరిగ్గా నిద్ర పట్టలేదు. నిద్ర పట్టినా కల నిండా కుక్కపిల్లలే! అందుకనే లేచీలేవగానే ఇలా వచ్చేశాను' అని చెప్పాడు చిన్నా. 'మరి నీ సంగతి ఏంటి?' అని అడిగాడు.
        'నాదీ నీదీ ఒకే కథ.' అన్నాడు గోపీ నవ్వుతూ.
     'ఒరేయ్.. నాకు ఇరవై గోళ్ల కుక్కపిల్ల చాలా అవసరంరా. ఎప్పటినుంచో పెంచుకోవాలని ఉంది. ఈసారి దొరక్కపోతే- చాలా బాధే..!' అన్నాడు చిన్నా.
      'నాక్కూడా అంతేరా... మూడేళ్ల నుంచి చూస్తున్నాను. పోయినేడు వెంకమ్మ గారి కుక్క ఇరవై గోళ్ల పిల్లను పెట్టింది. దాన్నేమో ముందు నేనే చూశాను. కానీ, గణపతి గాడు ఎత్తుకుపోయాడు. వెంకమ్మ వాళ్లూ వాడినే సపోర్టు చేశారు' అన్నాడు గోపి.
        ఈలోగా తల్లికుక్క బయటికి వెళ్లింది. పిల్లలను చూడటానికి ఇద్దరూ సందులోకి దూరారు. ఇలా పిల్లలను పట్టుకోబోతుండగా - వెనుక నుంచి తల్లికుక్క అరుపు వినిపించింది. అది వెళ్లినట్టే వెళ్లి వెనక్కి వచ్చింది. వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి పరుగెత్తుకొని వచ్చేశారు. తరువాత చాలాసేపు మాటు వేసి చూశారు కానీ, కుక్క కదల్లేదు. పిల్లలను వదిలి బయటికి వెళ్లలేదు. 'మనమీద దానికి అనుమానం వచ్చేసింది. ఈ దరిదాపుల్లో మనం ఉండగా- ఇక బయటికి వెళ్లదు. పదా పోదాం' అనుకొని, గోపి, చిన్నా ఇళ్లకు వెళ్లిపోయారు.
       'మధ్యాహ్నం వేళ కుక్క బయటికి వెళుతుంది. ఈసారి కచ్చితంగా పిల్లల గోళ్లు చూడాలి. చిన్నాగాడి కంట్లో పడితే- అవకాశం పోతుంది' అని గట్టిగా అనుకున్నాడు గోపి. చిన్నా వాళ్ల వీధిలోంచి కాకుండా వేరే దారిలో కర్రికుక్క ఉన్న సందులోకి వెళ్లాడు. తల్లికుక్క లేదు. చాలా సంతోషంగా... బుజ్జికుక్క పిల్లలను పట్టుకొని, కాళ్ల గోళ్లు లెక్కించటం మొదలెట్టాడు. ఉత్కంఠగా ఉంది. ఐదు కుక్కపిల్లలను ఒక్కొక్కటి చేతిలోకి తీసుకొని గోళ్లు లెక్కపెట్టాడు. ఒక్కదానికీ ఇరవై గోళ్లు లేవు. ఆరోది కూడా లెక్క పెట్టాడు. అది కూడా మామూలుదే! ఇక ఒకటే మిగిలింది.. గోధుమ రంగు బొచ్చు.. నుదుట రెండు తెల్లమచ్చలు ఉన్న కుక్కపిల్ల. దాన్ని చేతిలోకి తీసుకొని ఆత్రుతగా లెక్కపెట్టాడు. ఒక్కసారిగా మనసు ఉప్పొంగి పోయింది. దానికి ఇరవై గోళ్లు ఉన్నాయి మరి! ఈలోగా తల్లికుక్క అరుపు వినిపించి... బుజ్జికుక్కను వదిలేసి .. ఒక్క ఉదుటున వీధిలోకి వచ్చేశాడు.
      కళ్లు ఆనందంతో మెరిసిపోతున్నాయి. ఎన్నాళ్లనుంచో వెతుకుతున్న నిధి దొరికినంత సంతోషం. 'ఈ విషయం ఎవరికి చెప్పాలి? చిన్నాగాడికి చెబితే ..? వామ్మో .. ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్లేముంది? రేపే చిన్నాగాడి పుట్టినరోజు. చిన్నాకు ఇరవై గోళ్ల కుక్కపిల్లను బహుమతిగా ఇవ్వాలి. అప్పుడు వాడి ఆనందాన్ని చూడాలి. చిన్నా తన స్నేహితుడు. స్నేహితుడిని సంతోషపెట్టడం అన్నిటికన్నా గొప్ప సంతోషం కదా..!' అనుకున్నాడు గోపి.

     సందులోకి వెళ్లి చూశాడు. తల్లి కుక్క లేదు. నాలుగు పిల్లలు ఒకదానిని ఒకటి మూతితో నెట్టుకొంటున్నాయి. మూడు ఒకదాని మీద ఒకటి తలలు పెట్టుకొని బజ్జున్నాయి. తనకు కావాల్సిన గోధుమరంగు బొచ్చు, నుదుట రెండు తెల్లమచ్చలూ ఉన్న కుక్కపిల్ల చాలా చురుగ్గా కనిపిస్తోంది. రెండు కుక్కపిల్లలను తలతో నెట్టేస్తూ చలాకీగా ఉంది. తల్లికుక్క దరిదాపుల్లో లేదు. ఇదే మంచి తరుణమని ఒక్క ఉదుటున అక్కడికి వెళ్లి, గోధుమరంగు, నుదుట రెండు తెల్లమచ్చల కుక్కపిల్లను చేతుల్లోకి తీసుకొని, భద్రంగా గుండెలకు పొదువుకొని, తమ ఇంటివైపు పరుగుపెట్టాడు గోపి.
      అప్పటికే సిద్ధంగా ఉన్న వెదురుబుట్టను బయటికి తీశాడు. అడుగున మెత్తని పాత బొచ్చు తువాలు వేసి, దాని మీద కుక్కపిల్లను పడుకోబెట్టాడు. మనసంతా గొప్ప ఆనందంతో గంతులేస్తోంది. 'కానీ, ఈ సంగతి రేపటి ఉదయం దాకా ఎవరికీ తెలియకూడదు. చిన్నాగాడికి ఇరవై గోళ్ల కుక్కపిల్ల తనలాగానే చాలా రోజుల కల. పుట్టినరోజు కానుకగా ఈ బుజ్జికుక్కను వాడికి ఇచ్చి... అప్పుడు వాడి కళ్లల్లో మెరుపు చూడాలి!' అని అనుకుని హాయిగా నిద్రపోయాడు గోపి.

        ఉదయాన్నే వెదురుబుట్ట తీసుకొని, దానిలోని కుక్కపిల్ల బయటకు కనపడకుండా గుడ్డ కప్పి, చిన్నా ఇంటికి వెళ్లాడు గోపి. కిటికీలోంచి లోపలికి చూశాడు. గిరి, గణేష్‌, ఇసాక్‌, శివాజీ, సతీష్‌, అబ్దుల్లా, ఆశీర్వాదం అప్పటికే వచ్చి ఉన్నారు. వాళ్లంతా తమ స్కూలు ఫ్రెండ్సు. చిన్నా వాళ్లమ్మ అందరికీ పాయసం వడ్డిస్తోంది.
       గోపీ లోపలికి వెళ్లాడు. 'హ్యాపీ బర్త్‌ డే చిన్నా!' అని చెప్పాడు.
       చేతిలోని వెదురుబుట్టను టేబులు మీద పెట్టి, పైన కప్పిన గుడ్డ తొలగించాడు.
       అందరూ ఆశ్చర్యంగా గోధుమరంగు, నుదుట రెండు తెల్లమచ్చల బుజ్జికుక్క పిల్ల వైపు చూశారు. అప్పుడు గోపీ దానిని చేతిలోకి తీసుకొని-
       'ఇదిగోరా చిన్నా .! ఇరవై గోళ్ల కుక్కపిల్ల. ఇదే నీకు పుట్టినరోజు కానుక!' అని అందించాడు.
        చిన్నా ఆశ్చర్యపోయాడు. నమ్మశక్యం కానట్టు చూశాడు. 'ఎక్కడ దొరికింది?' అనడిగాడు.
       'ఇంకెక్కడీ అంకంరెడ్డోళ్ల వీధిలోని కర్రికుక్క దగ్గర.. నీకు చాలా ఇష్టం కదరా.. అందుకే నిన్న పొద్దుట నుంచి ఎప్పుడు తెల్లారుద్దా.. అని ఎదురుచూస్తున్నా..' సంతోషంగా చెప్పాడు గోపీ.
        'అరే .. భలే మంచిదిరా ఆ నల్లకుక్క. చూపిస్తా చూడు..నీకూ ఓ చిత్రం..' అని పక్కగదిలోకి వెళ్లాడు చిన్నా.
         ఓ అట్టపెట్టె తీసుకొచ్చాడు. దానిపైన 'ప్రియమైన గోపీ గాడికి..' అని రాసి ఉంది. పెట్టె తెరిచాడు. దానిలో నల్లబొచ్చు మీద తెల్ల మచ్చలు ఉన్న బుజ్జికుక్క పిల్ల ఉంది.
         'ఇదిగోరా.. ఇది నీకోసమే నిన్నటినుంచి ఎదురుచూస్తోంది. ఇదీ ఇరవై గోళ్ల కుక్కపిల్లే! అంకంరెడ్డోళ్ల నల్లకుక్క దగ్గరదే.. నిన్న నీకన్నా ముందే దీనిని తెచ్చేశాను. మరొక ఇరవై గోళ్లది ఉందన్న సంగతి ఆ తొందర్లో చూడనే లేదు' అన్నాడు చిన్నా.
          మిత్రులందరూ ఆశ్చర్యపోయారు.. ఆనందపడ్డారు. 'ఇరవై గోళ్ల కుక్కపిల్ల దొరకటం కన్నా చాలా ఆనందంగా ఉందిరా.. మీలా ఒకరి సంతోషం కోసం మరొకరు ఆలోచించే మిత్రులు దొరకటం..' అన్నారు చిన్నావాళ్ల నాన్న, అమ్మ.

- సత్యాజీ
94900 99167