Mar 16,2021 06:24

ఆర్థిక విధానం విషయంలో బిజెపి ప్రభుత్వపు అవగాహనా రాహిత్యం తెలిసిందే. అటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకోడానికి వీలుగా ప్రభుత్వ వ్యయాన్ని ఏ విధంగా పెంచాలి అన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటోంది. ఇక్కడే అది ఇరుకున పడిపోయింది కూడా. ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి మార్గం ఏమిటన్నది ఈ ప్రభుత్వానికి తోచడం లేదు. ప్రభుత్వ ఖర్చు పెంచడానికి కావలసిన అదనపు ద్రవ్యాన్ని అప్పులు చేయడం ద్వారా సేకరించాలి. అలా చేస్తే ద్రవ్యలోటు పెరిగిపోతుంది. ద్రవ్యలోటు పెరిగిపోతే ఐఎంఎఫ్‌ ఆగ్రహానికి మన ప్రభుత్వం గురి కావలసివస్తుంది. ఎంత వీర దేశభక్తులుగా ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నా, ఐఎంఎఫ్‌ ఆదేశాలను బేఖాతరు చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. అందువలన అప్పులు చేసి తద్వారా అదనపు ద్రవ్యాన్ని సేకరించి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం అన్న ప్రసక్తి తలెత్తదు. 


పోనీ, పెట్టుబడిదారుల మీద అదనంగా సంపద పన్ను గాని, లాభాలపై పన్ను గాని విధించి తద్వారా మరింత ధనాన్ని సేకరిద్దామా అంటే, అదీ కుదరదు. ఆ కార్పొరేట్లే బిజెపి కి కావలసినంత ఆర్థిక వనరులను సమకూర్చు తున్నారు. అందుకు బదులు తీర్చుకోడానికి వాళ్ళకి మరింతగా పన్నుల రాయితీలను కల్పించడం బిజెపి కి ప్రధానమైన కర్తవ్యం అయిపోయింది. ఎన్ని రకాలుగా, ఎంత ఎక్కువగా కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తే, ఎంత ఎక్కువగా ఆర్థిక వనరులను వారికి కట్టబెడితే, అంత ఎక్కువగా పెట్టుబడులు వస్తాయన్నది బిజెపికి ఉన్న గట్టి నమ్మకం. 


ఈ నమ్మకం పూర్తిగా నిరాధారం. పన్ను రాయితీలు ఇచ్చినంత మాత్రాన పెట్టుబడిదారుల నికర లాభాలు పెరిగిపోతాయన్న గ్యారంటీ ఏమీ లేదు. పన్ను రాయితీలిస్తే ఆమేరకు ప్రభుత్వానికి రాబడి తగ్గుతుంది. రాబడి తగ్గినా ద్రవ్యలోటు పెరగకుండా ఉండాలంటే ప్రభుత్వ వ్యయం తగ్గించుకోవాలి. ప్రభుత్వ వ్యయం తగ్గిపోతే ప్రజల వద్దకు చేరే ధనం తగ్గుతుంది. అప్పుడు వారు చేసే ఖర్చు తగ్గుతుంది. అంటే మార్కెట్లో డిమాండ్‌ తగ్గిపోతుంది. సరుకుల అమ్మకాలు తగ్గిపోతాయి. దానివలన పెట్టుబడిదారుల లాభాలు తగ్గిపోతాయి. 


కొంతమంది కార్పొరేట్ల లాభాలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా అని ఎవరైనా అడగవచ్చు. అది నిజమే. కొంతమంది పెట్టుబడిదారుల లాభాలు పెరుగుతున్నాయి. ఆ మేరకు తక్కిన పెట్టుబడిదారుల లాభాలు తగ్గిపోతాయి. ఎక్కువ లాభాలొచ్చిన వారు మరింత పెట్టుబడి తిరిగి పెట్టవచ్చు. కాని ఆ మేరకు తక్కిన పెట్టుబడిదారులు పెట్టే పెట్టుబడులు తగ్గిపోతాయి. మొత్తం పెట్టుబడిదారీ వర్గాన్ని అంతా కలిపి చూసుకుంటే వారంతా కలిపి పెట్టే పెట్టుబడి ఏమీ పెరగదు. 


పైగా ఎక్కువ లాభాలొచ్చిన వారంతా తిరిగి ఎక్కువ పెట్టుబడులు పెట్టేస్తారనుకోలేం. వారికి ఆ పెట్టుబడుల మీద లాభాలు వస్తాయనుకున్నప్పుడే వారు పెట్టుబడి పెడతారు తప్ప తమకు లాభాలొచ్చాయి గనుక దాన్నంతా తిరిగి పెట్టుబడిగా పెట్టేయరు. అలా లాభాలు రావాలంటే మార్కెట్లో డిమాండ్‌ పెరగాలి. ఆ విధంగా డిమాండ్‌లో ఎటువంటి పెరుగుదలా వచ్చే సూచనలు లేకపోతే పెట్టుబడిదారులకు ఇచ్చిన పన్ను రాయితీలను వాళ్ళు జాగ్రత్తగా దాచుకుంటారే తప్ప ఆటోమేటిక్‌గా తిరిగి పెట్టుబడులుగా పెట్టరు. 


కాని ఎక్కువ పన్ను రాయితీలిస్తే ఆ ప్రోత్సాహంతో పెట్టుబడిదారులు ఎక్కువగా పెట్టుబడులతో ముందుకొస్తారనే తప్పుడు వాదననే పదే పదే ముందుకు తెస్తూ వుంటారు. ఈ కారణాన్ని చూపించి కార్పొరేట్ల అధిక లాభాల మీద అదనంగా పన్నులు వేయడానికి నిరాకరిస్తారు. అందువలన అదనంగా ప్రభుత్వం తన వ్యయం పెంచడానికి తోడ్పడే ముఖ్యమైన ఆదాయ వనరును వాడుకోవడంలేదు. దానికి బదులుగా పరోక్ష పన్నులను పెంచడం ద్వారా అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకోడానికి పూనుకుంటోంది. 


జిఎస్‌టి విధానం అమలు లోకి వచ్చాక జిఎస్‌టి కౌన్సిల్‌ ద్వారా మాత్రమే పరోక్ష పన్నులను పెంచడం గాని తగ్గించడం గాని చేయాల్సి వుంటుంది. ఈ విషయంలో కేంద్రం తన ఇష్టం ప్రకారం ఏది పడితే అది చేయడానికి లేదు. ఈ జిఎస్‌టి పరిధి లోకి రాని ఒకే ఒక పాడి ఆవులాంటి ఆదాయ వనరు పెట్రో ఉత్పత్తులు. అందుకే కేంద్రం పెట్రో ఉత్పత్తుల మీద పన్నులను పెంచి అదనంగా రాబడి పొందాలని చూస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ద్రవ్య విధానం ఇప్పుడు స్పష్టమే. పెట్రో ఉత్పత్తుల మీద పన్నులు పెంచి అదనపు రాబడి పొందడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలను అయినకాడికి తెగనమ్మడం, ఈ రెండు మార్గాల ద్వారా వచ్చిన ద్రవ్యాన్ని ఖర్చు చేసి ద్రవ్యలోటు అదుపులో ఉండేలా చూసుకోవడం, తద్వారా ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచడం. 


అయితే ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మడం ద్వారా ప్రభుత్వానికి ఆశించినంత రాబడి సమకూరడం లేదు. అమ్మకానికి పెట్టిన ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థనూ కొనేయడానికి కార్పొరేట్లు ఎగబడడం లేదు. దానికన్నా, కొంతకాలం ఆగితే మరింత లాభదాయకమైన సంస్థలను మరింత కారుచవకగా కొనడానికి వీలవుతుందన్న సంగతి వాళ్ళకు తెలుసు. ఇక పెట్రో ధరలను పెంచడం ఒక్కటే ప్రధానమైన ఆదాయ వనరుగా ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా సమకూరిన ఆదాయాన్ని ఖర్చు చేస్తే ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి కావలసిన ఉద్దీపన లభిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.


కాని, ఒక్క పెట్రో ఉత్పత్తులపై అదనంగా విధించిన సుంకాలతోటే ప్రభుత్వానికి ఉద్దీపనకు కావలసిన ద్రవ్యం సమకూరుతుందనుకుంటే పొరపాటు. నిజానికి 2021-22 సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌లో...మొత్తం ప్రభుత్వ వ్యయం గత ఏడాది (2020-21)తో పోల్చితే పెరిగింది ఒక శాతం కన్నా కూడా తక్కువే (పెరిగిన ధరల ప్రభావాన్ని కలిపి లెక్క కడితే వాస్తవ పెరుగుదల ఏమీ లేదన్నమాట). అంటే వాస్తవ వ్యయం తగ్గింది. మరి ఈ విధంగా ప్రభుత్వ వ్యయం పడిపోతే ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా కోలుకోగలుగుతుంది? అటు పక్క చూస్తే పెట్టుబడిదారుల వైపు నుండి వచ్చే అదనపు పెట్టుబడులు ఏవీ లేవు. వినిమయం పెరగడానికి వీలుగా ప్రజల ఆదాయాలూ పెరిగింది లేదు.
పరోక్ష పన్నులను పెంచడం ద్వారా అదనపు ఆర్థిక వనరులను సమీకరించి, వాటితో ప్రభుత్వ వ్యయాన్ని పెంచితే మొత్తం మీద మార్కెట్‌లో డిమాండు పెరుగుతుందనుకోవడం తప్పు. పెట్టుబడిదారులు చేసే ఖర్చుల మీద పరోక్ష పన్నులు పెంచితే మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతుంది. ఆ పెట్టుబడిదారులు పెరిగిన పన్నులను చెల్లించడం కోసం తమ వద్ద నుండే నిల్వలనుండైనా ఖర్చు చేస్తారు, లేదా బ్యాంకుల నుండి అప్పులైనా తెస్తారు. ఏది చేసినా మార్కెట్‌ లోకి అదనంగా డబ్బు వస్తుంది. దాంతో డిమాండ్‌ పెరుగుతుంది. అలాగాక, వేతనాలమీద బతికే వారు చేసే ఖర్చుల మీద అదనంగా పన్నులు వేస్తే, ఆ పన్నులు చెల్లించడం కోసం వారు ఇతరత్రా ఖర్చులను తగ్గించుకుని ఈ పన్నులు చెల్లిస్తారు. అందువలన మార్కెట్‌లో డిమాండ్‌ పెరగదు సరికదా తగ్గిపోతుంది.


ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల మీద విధించే పన్ను ఏ తరహాకు చెందినది? ప్రభుత్వం మాత్రం ఈ పన్ను విలాసవంతమైన ఖర్చుపై విధించే పన్ను గానే పరిగణిస్తున్నట్టుంది. కార్లు. పెద్ద పెద్ద మోటారు వాహనాలు వాడే సంపన్నులు మాత్రమే డీిజిల్‌, పెట్రోల్‌ వినియోగిస్తారని బిజెపి ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. వాటిపై అదనపు సుంకం విధిస్తే పేదలకేమీ ఇబ్బంది కలగదని అనుకుంటున్నట్టుంది.


అలా అనుకోవడం పూర్తిగా తప్పు. పెట్రో ఉత్పత్తులు కూడా విద్యుత్తు, బొగ్గు వంటి సరుకుల మాదిరిగానే సార్వత్రిక మాధ్యాలు. కేవలం ప్రైవేటు వినియోగానికే కాకుండా ప్రజా రవాణా కోసం, సరుకుల రవాణా కోసం, వ్యవసాయంలోను పెట్రో ఉత్పత్తులను వాడతారు. అంటే అందరికీ అవసరమైన తిండిని అందించడంకోసం కూడా పెట్రో ఉత్పత్తుల వాడకం అవసరం. ఈ పెట్రో ఉత్పత్తుల రేట్లు గనుక పెరిగితే, వాటిని ఉపయోగించి ఉత్పత్తి చేసే సరుకుల రేట్లు కూడా పెరుగుతాయి. వాటిని ఉపయోగించేవారిలో పేదవారే అత్యధిక శాతం. ఒకవేళ ఆ సరుకుల రేట్లు పెరగడంలేదంటే, వాటిని ఉత్పత్తి చేసే చిన్న ఉత్పత్తిదారులు- ఉదాహరణకు రైతులు- భారీగా నష్టపోతారు. పెట్రో ఉత్పత్తుల వంటి సార్వత్రిక మాధ్యాల రేట్లు పెంచడం మొత్తం మీద ఏదో ఒక విధంగా సామాన్యుల ఆదాయాలను దెబ్బతీస్తుంది.


ఇటీవల కాలంలో ధరలు బాగా పెరుగుతున్నాయి. ఒకవైపున డిమాండ్‌ తగ్గిపోతూ వున్నా ధరలు ఈ విధంగా పెరగడానికి కారణం పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరగడమే. ఇది ప్రభుత్వ విధాన ఫలితమే. ధరలు పెరుగుతున్నాయి గనుక రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించదు. అందువలన రుణాలపై ఎక్కువ వడ్డీ చెల్లించ వలసి వుంటుంది. ఈ భారం చిన్న ఉత్పత్తిదారులపై తీవ్రంగా పడుతుంది. వారిలో మరింత ఎక్కువ మంది దివాలా తీస్తారు. మొత్తంగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానం అమలు జరుపుతున్న తీరు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్నే కలిగిస్తోంది.
                                                     * ప్రభాత్‌ పట్నాయక్‌ (స్వేచ్ఛానుసరణ)