ప్రజాశక్తి-సీలేరు
అల్లూరి సీతారామరాజు జిల్లా జికె.వీధి మండలం అంతర్రాష్ట్ర రహదారిలో ప్రయాణం ప్రాణ సంకంటంగా మారింది. సీలేరు నుంచి ఆర్‌వి.నగర్ వరకు 48 కిలోమీటర్ల పైగా ఇరుకైన సింగల్ రోడ్డు కావడంతో వాహనాలు వచ్చి పోయేటప్పుడు వాహనం వాహనం రాసుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకదానికి ఒకటి రాసుకొనే క్రమంలో ముందుకి వెనక్కి వెళ్లలేక రహదారి మధ్యలో నిలిచిపోతున్నాయి. దీంతో గంటలు తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు దట్టమైన కారడవిలో రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. ఇదే సమయంలో మార్గమధ్యలోనే నిలిచిపోతే ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ సర్వీస్, విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే నైట్ సర్వీస్ చప్పర్ల ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా ఒకదానికొకటి రాసుకొని ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో డ్రైవర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ప్రయాణికులు అడవులోనే రెండు గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. అదే రోజు భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీ 31జెడ్ 0335 నెంబర్ గల బస్సు చింతపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో పెంటపాడు ఘాట్ రోడ్డులో డీజిల్ అయిపోయి బస్సు రాత్రి 2.30 నుండి ఉదయం 5.30 గంటల వరకు నిలిచిపోవడంతో సుమారు 30 మంది ప్రయాణికులు అటవీ ప్రాంతంలో ఉండిపోయారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు రహదారిని విస్తరించడానికి చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.










