Apr 08,2023 22:24

డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం మౌనం
ప్రతిపాదనలు పంపినా సమాధానం కరువు
రూ.600 కోట్లకుపైగా పనులు పడక
15న కాలువల మూసివేతకు నిర్ణయం
కాలువలు పూడుకుపోయి ప్రతియేటా పంట నష్టం
మెయింటినెన్స్‌ పనులకైనా నిధులిచ్చేనా?
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జిల్లా రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పంట కాలువలు పూడుకుపోయి ప్రతియేటా ఖరీఫ్‌లో వేలాది ఎకరాల్లో పంట నష్టపోవడంతోపాటు రబీలో సాగునీటి కోసం అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం మౌనం వహిస్తోంది. కనీసం కాలువల మెయింటినెన్స్‌ పనులకైనా నిధులిస్తారా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌ 15న పంట కాలువల మూసివేతకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్‌ ఒకటో తేదీన కాలువలకు తిరిగి సాగునీరు విడుదల చేయనున్నారు. దాదాపు రెండు నెలల 15 రోజుల సమయం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌, రబీల్లో దాదాపు ఎనిమిది లక్షలకుపైగా ఎకరాల్లో వరిసాగు సాగుతోంది. డెల్టాలో వరిసాగే ప్రధానంగా ఉంది. 11 ప్రధాన కాలువలు, 300కుపైగా పిల్ల కాలువల ద్వారా డెల్టా ఆయకట్టుకు సాగునీరు సరఫరా సాగుతోంది. వైసిపి ప్రభుత్వం అధికారంలొకొచ్చాక జిల్లాలో డెల్టా కాలువల ఆధునికీకరణ ప రిస్థితి అత్యంత దారుణంగా మా రింది. జిల్లాకు ఇద్దరు మ ంతు లున్నా రైతులకు మేలు జరగని పరిస్థితి నెలకొంది. గడిచిన మూడేళ్లుగా జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తిగా పడకేశాయి. చిన్నచిన్న మెయింటినెన్స్‌ పనులు మినహా కాలువల పూడికగాని, షట్టర్లకు సంబంధించిన పనులుగాని ఏఒక్కటీ జరగని పరిస్థితి ఉంది. వైసిపి ఐదేళ్ల పాలనలో ఆధునికీకరణ పనులకు ఇదే చివరి ఏడాది. ఈ ఏడాదైనా ఎంతోకొంత ఆధునికీకరణ పనులు చేస్తారని రైతులు భావించారు. జిల్లాలో దాదాపు రూ.600 కోట్లు విలువైన ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇరిగేషన్‌ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ప్రతియేటా ఇదేవిధంగా ప్రతిపాదనలు పంపడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం సర్వసాధారణమైంది. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో కాలువలు మూసివేసే గడువు సమీపిస్తోంది. అయినప్పటికీ ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఆధునికీకరణ పనులు సంగతి పక్కన పెడితే కనీసం మెయింటినెన్స్‌ పనులకు సంబంధించిన నిధులైనా ఇస్తారా అనే బెంగ అందరినీ వెంటాడుతోంది. ప్రతియేటా కాలువలు, షట్టర్లు వద్ద మెయింటినెన్స్‌ పనులకు జిల్లాలో రూ.50 కోట్లు వరకూ ఖర్చవుతోంది. ఈ నెల 12న విజయవాడలో ఇరిగేషన్‌ శాఖ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మెయింటినెన్స్‌కు సంబంధించిన నిధులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిధులైనా జిల్లాకు సరిపడా కేటాయిస్తారా అనే అనుమానం నెలకొంది.
రైతులు నష్టపోతున్నా పట్టని ప్రభుత్వం
తమది రైతు ప్రభుత్వమని వైసిపి సర్కార్‌ గొప్పలు చెప్పడం మినహా రైతుల గురించి ఆలోచించిన పరిస్థితి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెల్టాలో కాలువలు మొత్తం పూడుకుపోయి సాగునీరు సక్రమంగా కిందకు పారని దుస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో చిన్నపాటి వర్షాలకు సైతం కాలువలు ఎగదన్ని పొలాలన్నీ నీట మునిగిపోతున్నాయి. దీంతో రైతులు పెద్దఎత్తున పంట నష్టపోతున్నారు. ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడులు పెట్టిన రైతులు పంటనష్టంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే నష్టపరిహారం రూ.ఆరు వేలు మాత్రమే. ఆ పరిహారం కూడా సాగు చేయని భూయజమానులకు ఇస్తున్నారు. జిల్లాలో 70 శాతం సాగు కౌలురైతులే చేస్తున్నారు. వీరంతా ప్రతియేటా పెద్దఎత్తున నష్టాలను చవిచూస్తున్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు జరిగితే పంటనష్టం జరిగే పరిస్థితి ఉండదు. రైతులకు అత్యంత అవసరమైన ఆధునికీకరణ పనులపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వ తీరుపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.