ప్రజాశక్తి - తెనాలి : రైతు సమస్యలపై అధికారులు నిర్లక్ష్య ధోరణిని వీడాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అన్నారు. భారీ వర్షాలకు ఐతానగర్, నేలపాడు తేలప్రోలు, కంచర్లపాలెం ప్రాంతాల్లో వెద వారినారు నీట మునగడంపై ఇరిగేషన్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు నిరసన చేపట్టారు. సాంబిరెడ్డి మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో దాదాపు 80 శాతం మంది కౌలు రైతులేనని, వారంతా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏటా నష్టపోతున్నారని చెప్పారు. ప్రస్తుతం తెనాలి పరిధిలో ఐదు వేల ఎకరాల్లో వెదపెట్టిన వరినారు నీటి పాలైందన్నారు. వేసవిలోనే కాల్వలు పూడికలు తీయించాల్సిన అధికారులు ఆ పనులకు ఇప్పుడు టెండర్లు పిలవటం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైగా నష్టపోయారని, ఈ మొత్తాన్ని రైతులకు నష్టపరిహారంగా చెల్లించడంతోపాటు మళ్లీ సాగుకు విత్తనాలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఐతానగర్ అధ్యక్షులు ఈదర పూర్ణచంద్ర మాట్లాడుతూ అధికారుల మొండి వైఖరి కారణంగా ప్రతి ఏట రైతులు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు ఇరిగేషన్ ఈఈ ఎస్.మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎం.సాంబశివరావు, వి.రోశయ్య, ఇ.శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వర్లు, కె.శివరామకృష్ణ, టి.రవిచంద్ర, ఇ.బుచ్చిబాబు పాల్గొన్నారు.










