May 23,2023 17:12

వినతిపత్రం అందజేస్తున్న అఖిలపక్షాల నాయకులు

ఇరిగేషన్‌ గృహాలు పేదలకు ఇవ్వాలి
- అఖిల పక్షాలు డిమాండ్‌
ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్టు

      సుండిపెంటలో జల వనరుల శాఖ గృహాలలో నివాసం ఉంటున్న పేదలకు భూమి పన్ను (గ్రౌండ్‌ రెంట్‌) రద్దు చేసి వారికే ఇండ్లను ఉచితంగా ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం సాయంత్రం తర్వాత తహశీల్దార్‌ బి.రాజేంద్ర సింగ్‌కు, జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసులకు వారి వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుండి పెంటలోని జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల ఒక ప్రభుత్వ ప్రకటనను అనౌన్స్మెంట్‌ ద్వారా నోటీసు రూపంలో కాలనీవాసులకు తెలియజేయడం జరిగినది. ఈ విషయంలో భాగంగా ప్రజాసంఘాల నాయకులు దీనిపై సంబంధిత అధికారులు కలిసి గ్రౌండ్‌ రెంటు, కరెంటు బిల్లు, వాటర్‌ బిల్లులపై మాట్లాడారు శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు 35 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, వీరందరూ దాదాపు 60 సంవత్సరాల నుండి శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం పనులకు సేవలు అందించి వారిలో ఈ కుటుంబాలు ఇక్కడే స్థిరపడిపోయారన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు వీరికి తాగునీరు, విద్యుత్తు, వైద్యం సదుపాయాలను జల వనరుల శాఖ ఆధీనంలో కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడంతో జలవరుల శాఖ నిధులు లేవనే సాకుతో ప్రజలను ఇబ్బంది పెడుతుండడం సమంజసం కాదన్నారు. ప్రజా సంఘాల ఆందోళన ఫలితంగా పాత విద్యుత్‌ బకాయిలు అప్పటి న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చొరవతో రూ.40 కోట్లకు పైగా చెల్లించారని తెలిపారు. అప్పటి నుండి సుండిపెంట అభివృద్ధికి కొంత బడ్జెట్‌ కేటాయిస్తున్నారని చెప్పారు. ఆ నిధులతోనే తాగునీరు, కరెంటు సదుపాయాలను కల్పిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ గృహాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయని, అక్కడ నివాసముంటున్న వారే వాటిని మరమ్మతులు చేయించుకోవాలని చెప్పారన్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా 2016 నుండి పాత బకాయి విద్యుత్‌ బిల్లులు, భూమి పన్ను, వాటర్‌ చార్జీలు కట్టమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే పాత బకాయిలు, పన్నులు రద్దు చేసి ప్రభుత్వ గృహాలకు నివాసముంటున్న పేదలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆశీర్వాదం, సిపిఐ మండల కార్యదర్శి పి.పులి రాజు, టిడిపి నాయకులు జంకె రామసుబ్బారెడ్డి, ఉమా, బిజెపి నాయకులు సోమిశెట్టి మల్లికార్జున, గ్రామ అభివృద్ధి కమిటీ కార్యదర్శి కత్తుల కోటేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు ఓబులయ్య, ఏఐవైఎఫ్‌ కార్యదర్శి లక్ష్మయ్య, ఐఎఫ్టియు వై.శ్రీను, ముస్లిం మైనారిటీ నాయకులు అబ్దుల్‌ జాబేద్‌, మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చిన్ని శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షులు నాగేళ్ల సురేష్‌, ఆటోమొబైల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఏ.బెనహర్‌, ఎస్‌కే వలి, వెంకటేశ్వర్లు, కార్మిక, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.