Jul 28,2021 09:07

టెహ్రాన్‌: భారత్‌లో వెలుగుచూసి.. సెకండ్‌ వేవ్‌ ఉధృతికి దారితీసిన డెల్టా వేరియంట్‌ ఇప్పుడు పలు దేశాలపై విజృంభిస్తోంది. ఈ జాబితాలో ఇరాన్‌ కూడా ఉంది. అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 34,900 కేసులు, 357 మరణాలు నమోదయ్యాయి. సోమవారం కూడా 31,814 కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇరాన్‌ ప్రభుత్వం గత వారమే ఆంక్షలు విధించింది. కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది. నిత్యాసవసరాల దుకాణాలు మాత్రమే తెరచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. అయితే ఆంక్షల విషయంలో కఠినంగా వ్యవహరించకుండా ప్రజల అబిష్టానికే వదిలిపెట్టడంతో జనాలు సమూహాంగా తిరుగాడుతుండటంతో కేసులు పెరుగుతున్నాయి. టెహ్రాన్‌లో షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లు, మెట్రో స్టేషన్లలో జన సంచారం తీవ్రంగా ఉంది. ఆసుపత్రిలు ఖాళీ ఉండటం లేదు. ఎక్కువ మంది శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వస్తుండటంతో వైద్య నిపుణుల్లో ఆందోళన నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లోనే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరిస్తున్నారు.