Aug 08,2021 17:48

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపిఎల్‌ 14వ సీజన్‌ను యుఎఇలో పూర్తిచేసేందుకు బిసిసిఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కోసం బిసిసిఐ బయో బబుల్‌ నిబంధనలు విడుదల చేసింది. ఇటీవల శ్రీలంక పర్యటనలో పలువురు భారత క్రికెటర్లు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో ఐపిఎల్‌ కోసం మరింత భద్రమైన, కఠినమైన బయో బబుల్‌ నియమావళికి బిసిసిఐ రూపకల్పన చేసింది. ఈ మేరకు నూతన నిబంధనలు ఉల్లంఘించే ఫ్రాంచైజీ జట్టు క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని బిసిసిఐ స్పష్టం చేసింది. తాజా బయో బబుల్‌ ప్రకారం.. విదేశీ ఆటగాళ్లు ఐపిఎల్‌కు వచ్చే 72 గంటల ముందు కరోనా ఆర్‌టిపిసిఆర్‌ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి. నెగెటివ్‌ వచ్చిన వారు తమ ఫ్రాంచైజీకి కేటాయించిన నగరానికి చేరుకోవచ్చు. నెగెటివ్‌ వచ్చిన వారికి ఎలాంటి క్వారంటైన్‌ అమలు చేయరు. విదేశీ క్రికెటర్లు దుబాయి ఎయిర్‌ పోర్టులో తమ నెగెటివ్‌ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది. ఒక్కసారి బయో బబుల్‌లో ప్రవేశించాక ఏదైనా అనివార్య కారణాలతో తప్ప మరే ఇతర కారణాలకు బయటికి పంపించడం కుదరదు. బబుల్‌ నుంచి బయటికి వచ్చేవారు బిసిసిఐ వైద్యాధికారి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తిరిగి బయో బబుల్‌లో ప్రవేశించాలంటే 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. పైగా వారికి 2వ, 4వ, 6వ రోజు నిర్వహించే ఆర్‌టిపిసిఆర్‌ టెస్టులో నెగెటివ్‌ వస్తేనే బబుల్‌లోకి ప్రవేశం కల్పిస్తారు.