Apr 20,2023 21:18

ప్రార్థనలో పాల్గొన్న డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

ఇఫ్తార్‌ విందులు అనుబంధాలను పెంపొందిస్తాయి


ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

పవిత్ర రంజాన్‌ మాసంలో జరిగే ఇఫ్తార్‌ విందులు ప్రజల మధ్య ఆత్మీయ అనుబంధాలను పెంపొందిస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి ఎస్‌బి అంజాద్‌ బాషా తెలిపారు. గురువారం నంద్యాల పట్టణంలోని ఆర్‌కె కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాలులో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిములకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రి ఎస్‌బి అంజాద్‌ బాషా, జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, తోగూరు ఆర్థర్‌, జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి, జెసి టి.నిశాంతి, మున్సిపల్‌ చైర్మన్‌ మాబున్నిసా, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్‌ సునీత అమృత రాజ్‌, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు సలోమి, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్‌ విందులో ముస్లిం సోదరులతో పాటు హిందూ, క్రైస్తవ సోదరులు కూడా భాగస్వాములై మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ముందుగా మంత్రి, కలెక్టర్‌లు ముస్లిం సంప్రదాయ రీతిలో ప్రార్థన చేసి ఉపవాస దీక్షను విరమింపచేశారు. అనంతరం ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మైనారిటీ నాయకులు, మత గురువులు పాల్గొన్నారు.