ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరాఘాతంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. వంద కొట్టు! పెట్రోలు బంకుల వద్ద ఇదివరకు వినిపించిన ఈ మాట ఇప్పుడు గొంతు సవరించుకోక తప్పడం లేదు. ఈ రోజు ఎంత పెరిగిందనే ఆందోళనా స్వరాలే నేడు బంకుల వద్ద ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంధన ధరలు పెంచినప్పుడల్లా ఆందోళన చేస్తుంటే ఇదివరకు 'మనకెందుకులే' అనుకున్నవాళ్లూ ఇప్పుడు ఎర్రజెండా పట్టుకొని 'ఇంత అన్యాయమా?' అంటూ పాలకుల దోపిడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ ప్రజాగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాష్ట్రంలో వామపక్షాలు గురువారం చేపట్టిన ఆందోళనల్లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొనడం ధరాఘాతంపై నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రజాగ్రహానికి ప్రతీక. పెట్రో నిరసనల సెగలు తాకాల్సిన వాళ్లకు బాగానే తాకుతున్నాయి. సంఫ్‌ు పరివార్ అరాచక చర్యలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఇంధన ధరల తగ్గింపుపై దృష్టి సారించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రజాగ్రహ వేడి ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాబోయే ఎన్నికల్లో ఇంధన ధరలే తమ పీఠాలకు ఎసరు పెట్టేస్తాయన్న ఆందోళన పాలకుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే బిజెపి నేతలు వక్ర భాష్యాలు, సర్దుబాటు యత్నాలతో మసిపూసి మారేడుకాయ చేసే చర్యలకు పాల్పడుతున్నారు. కోవిడ్ టీకాలకూ, సంక్షేమ పథకాల అమలుకు పెట్రో ధరల పెరుగుదలను ముడి పెడుతున్నది అందుకే. ఉత్తరప్రదేశ్ లోని ఒక బిజెపి మంత్రి పెట్రోలు ధరల పెరుగుదల ప్రభావం కేవలం 5 శాతం మందిపైనే అని తేల్చేశారు. 95 శాతం మందికి ఇబ్బందేమీ లేదట! కోవిడ్ టీకాల కోసం గత బడ్జెట్‌లో కేంద్రం రూ.35 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు, రాయితీల కోసం మరో రూ.4 లక్షల కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. కేంద్ర అమాత్యులు చెబుతున్నట్లు ఇంధన ధరల పెంపు ఆ పనుల కోసమే అయితే మరి బడ్జెట్‌లో కేటాయించిన నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
హేతుబద్ధీకరణ పేరిట నిత్యం ధరలను సవరించుకునే వెసులుబాటు చమురు సంస్థలకు అప్పజెప్పిన నాటి నుంచి ధరల పెరుగుదలకు అడ్డే లేకుండా పోయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోలియం సంస్థలు ధరలు పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గి ముడి చమురు ధరలు అమాంతం పడిపోయిన సమయంలో ఆ హేతుబద్ధత ఏమైంది? వినియోగదారులకు దక్కాల్సిన తగ్గింపు లాభాన్ని గద్దలా తన్నుకెళ్లిందెవరు? కేంద్ర ప్రభుత్వమే కదా? వాస్తవానికి కేంద్రానికి, రాష్ట్రాలకు ఖజానా నింపుకోవడానికి ఇంధన పన్నులు, సుంకాలు పెద్ద ఆదాయ వనరు. ఇందులో అధిక వాటా కొల్లగొడుతున్నది కేంద్రమే. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)తో ఇప్పటికే రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టిన కేంద్రం పెట్రోలును జిఎస్‌టి పరిధిలోకి చేర్చకుండా రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయంటూ నెపాన్ని మోపుతోంది. ప్రజలపై భారాలు తగ్గించాలన్న చిత్తశుద్ధి కేంద్రానికి ఉంటే అది విధిస్తున్న ఎక్సైజ్ పన్నులు, సెస్సులు మినహాయించుకోవచ్చు కదా? ఆ పని చేయదు. రాష్ట్రాలకు ఉన్న ఆదాయ వనరును లేకుండా చేస్తే కీలుబొమ్మలుగా మార్చేసుకోవచ్చనేది మోడీ సర్కార్ ఎత్తుగడ.
పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాసు సిలిండరు ధర మోడీ పాలనలో రెట్టింపు అయ్యింది. సమస్త రవణా రంగానికి ఇంధనమే కీలకం. ఇంధనం ధరలు పెరిగితే రవాణా నుంచి తయారీ వరకూ ప్రతి రంగంపైనా వాటి ప్రభావం పడుతుంది. ఆహారం, కూరగాయలు, పాలుతో సహా అన్ని రకాల నిత్యావసరాల ధరలు ఆకాశానికి ఎగబాకుతాయి. మొత్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది. కేంద్రానికి ఈ సోయి లేకపోయింది. ఇంతలా ప్రభావం ఉంటుంది కాబట్టే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పన్నులు తగ్గించి సామాన్యులకు కాస్తయినా ఊరట కల్పిస్తున్నాయి. ఎ.పి ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్గించాలి. ఎక్సైజ్ పన్ను తగ్గించాలని కేంద్రాన్ని అడగాలి. ప్రజాగ్రహాన్ని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇంధన ధరలు తగ్గించాలి.










