Nov 17,2023 23:54

నివాసితులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : ఎమ్‌టిఎమ్‌సి (మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌) పరిధిలోని ఇప్పటంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సెంటున్నర స్థలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కేంద్ర గృహనిర్మాణ శాఖ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ సునీల్‌ ఫరూక్‌, ఇతర బృంద సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఇప్పటంలో మొత్తం 35 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించగా 28 మంది ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ ఇళ్లల్లోని మహిళలతో సునీల్‌ ఫరూక్‌ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఇల్లు లేనివారికి ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఆవాస యోజన పధకం ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన ఇళ్లు చాలా అందంగా ఉన్నాయని అన్నారు. ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.75 లక్షలు, అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాన్ని ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలైన విద్యుత్‌, రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలతో పాటు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు రూ.12 వేలు, డ్వాక్రా సంఘాల నుండి మరికొంత నగదు అందజేస్తోందని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లు బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో అధికారులు మనీష్‌, నాగభూషణం, టి.వేణుగోపాలరావు, వెంకటరెడ్డి, భాస్కర్‌, రామమోహనరావు, పంచాయితీ సెక్రటరి ప్రసాద్‌, వైసిపి మండల అధ్యక్షులు ఎం.వివేకానందరెడ్డి, తులసీదాస్‌ పాల్గొన్నారు.