ఏమైనా పిఆర్‌సి సంబంధించిన నికర లాభం...ఫిట్‌మెంట్ మరియు పిఆర్‌సి అమలు తేదేనిబట్టి వుంటుంది. పిఆర్‌సి కమిటీ వేసి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. కమిటీ గడువు 6 సార్లు పెంచారు. కమిటి రిపోర్టు ఇచ్చి 6 నెలలు గడిచాయి. పిఆర్‌సి నివేదిక ఒక పబ్లిక్ డాక్యుమెంట్. ప్రభుత్వం నేటికి పిఆర్‌సి నివేదికను బయట పెట్టలేదు. నివేదికను గోప్యంగా వుంచి అధ్యాయనానికి మరో కమిటీ వేసి కాలయాపన చేయడంతో ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు, ఉద్యోగుల పి.ఆర్.సి అమలు ఏక కాలంలో వస్తున్నాయి. ఎన్నికలకు ముందు మెరుగైన ఐ.ఆర్, పి.ఆర్.సి ల కోసం ఉద్యోగులు ఉద్యమించడం, రాజకీయ పార్టీలు ఊహించని పి.ఆర్.సి ఇస్తామని ఊరిస్తూ హామీలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఉద్యోగులు, రాజకీయ పార్టీలు ఎవరి ప్రయోజనం కోసం వారు ఆలోచించడం జరుగుతోంది.
పి.ఆర్.సి కమిటీలు సకాలంలో వేయించుకోవడం, పి.ఆర్.సి కమిటీకి తగు ప్రతిపాదనలు ఇవ్వడం, నివేదికలు సకాలంలో రప్పించడం కోసం, నివేదిక అమలు కోసం నిరంతర పోరాటాలు చేయాల్సి వస్తున్నది. ఒక పిఆర్‌సి అమలుకు సుమారు రెండేళ్ళ పోరాటం చేయాల్సి వస్తోంది. ఉద్యోగులకు ఐదేళ్ళకోసారి పిఆర్‌సి, ఆరు నెలలకొకసారి డి.ఎ న్యాయంగా ఇవ్వాల్సి వున్నా, వీటిని సకాలంలో ఇవ్వకుండా పండుగ కానుక పేరుతో ప్రభుత్వాలు ఊరిస్తున్నాయి. ఆ విధంగా ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి.
పిఆర్‌సి లు - ఆర్థిక ప్రయోజనం
పిఆర్‌సి ల చరిత్రలో 1958, 1961, 1982 (రీ గ్రూపింగ్ స్కేలు) 1986 పిఆర్‌సి లు మాత్రమే అమలు తేదీ, ఆప్షన్ తేదీ నుండి ఆర్థిక లాభం వర్తింపచేయడం జరిగింది. 1993, 1999 పిఆర్‌సి లు చంద్రబాబు కాలంలో 9 నెలలు నోషనల్ పీరియడ్‌గా అమలు జరిగాయి. 2004లో అధికారం లోకి వచ్చిన వై.యస్.రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఊహించని పిఆర్‌సి ఇస్తామని ఊరించి ఉసూరుమనిపించే ఐ.ఆర్, ఫిట్‌మెంట్, పిఆర్‌సి లు ఇచ్చారు. పిఆర్‌సిల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 21 నెలలు నోషనల్ పీరియడ్‌గా అమలు చేయడం వలన రెండేళ్ళ పిఆర్‌సి ఆర్థికంగా నష్టపోయారు. 2008 పిఆర్‌సి కూడా అదే బాటలో 21 నెలలు నోషనల్ పీరియడ్‌గా అమలు చేయడంతో ఉద్యోగులకు పెద్ద నష్టమే జరిగింది. ఈ రెండు పిఆర్‌సి లలో జరిగిన నష్టాన్ని నివారించాలని, 2013 పిఆర్‌సిలో నోషనల్ కాలాన్ని తగ్గించాలని ఉమ్మడి రాష్ట్ర జెఎసి పోరాడి, పిఆర్‌సి ని సకాలంలో వేయించుకుంది. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని ఒప్పించి 39 శాతం ఐ.ఆర్ సాధించుకున్నారు. తదుపరి రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంతో పోట్లాడి 43 శాతం ఫిట్‌మెంట్‌తో 2.6.2014 (రాష్ట్ర విభజన తేదీ నుండి) పిఆర్‌సి అమలు చేయించుకున్నారు. ఆ మేరకు 2013 పిఆర్‌సి లో నోషనల్ కాలాన్ని 11 నెలలకు తగ్గించుకోవడం జరిగింది.
1993, 1999 పిఆర్‌సి లలో 9 నెలలు, 2003, 2008 పిఆర్‌సి లలో 21 నెలలు, 2015 పిఆర్‌సి లో 11 నెలలు నోషనల్‌గా అమలయ్యాయి. దాంతో నోషనల్ పిఆర్‌సి కాలంలో పదవీ విరమణ పొందిన పెన్షనర్లు, ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ ప్రయోజనాలు లక్షల్లో నష్టపోయారు.
తాత్కాలిక భృతి-ఫిట్‌మెంట్
పిఆర్‌సి కమిటీలు సకాలంలో వేయకపోవడం, అమలు ఆలస్యం కావడంతో ఉద్యోగ సంఘాలు తాత్కాలిక భృతి కోసం పోరాడి సాధించుకున్నాయి. అయితే ఈ ఐ.ఆర్ ను, పిఆర్‌సి ఆర్థిక లాభం నుండి ప్రభుత్వం రికవరీ చేసుకుంటుంది. తాత్కాలిక భృతి ఉద్యోగి జీతంలో నికర లాభాన్ని చూపించదు. పిఆర్‌సి ద్వారా వచ్చే ప్రయోజనంలో అడ్వాన్సుగా తీసుకోవడం జరగుతుంది.
ఫిట్‌మెంటే కీలకం
ఐదేళ్ళ కాలంలో పెరుగుతూ వచ్చిన చివరి డి.ఎ ని పిఆర్‌సి అమలు తేదీన మూల వేతనానికి కలిపి లెక్కిస్తారు. అయితే ధరల పెరుగుదలకు, ప్రభుత్వం పెంచే డి.ఎ కు వ్యత్యాసం ఉంటుందని, నూరు శాతం న్యూట్రలైజేషన్ ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ప్రయోజనం కోసం పోరాడుతున్నాయి. 1974 పిఆర్‌సి లో 5 శాతం, 1986 పిఆర్‌సి లో 10 శాతం 1999 పిఆర్‌సి లో 25 శాతం, 2003 పిఆర్‌సి లో 16 శాతం, 2008 పిఆర్‌సి లో 36 శాతం, 2013 పిఆర్‌సి లో 43 శాతం సాధించుకున్నాయి. 2003లో ఊహించని పిఆర్‌సి ఇస్తామని వాగ్ధానం చేసిన వైఎస్‌ఆర్, 1993 పిఆర్‌సి లో చంద్రబాబు ప్రభుత్వంతో సాధించుకొన్న 25 శాతం కంటె తగ్గించి 16 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి ఉసూరుమనిపించారు. పిఆర్‌సి కమిటీ సిఫార్సులు ఏం చేసినా ఫిట్‌మెంట్ వరకు ప్రభుత్వ నిర్ణయమే కీలకమైనదిగా వుంటుంది.
2018 పిఆర్‌సి
ఉద్యోగులకు సంబంధించి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల హామీగా 27 శాతం ఐ.ఆర్ ఇస్తామని, పిఆర్‌సి లు, డి.ఎ లు సకాలంలో ఇస్తామని గట్టిగానే చెప్పారు. 27 శాతం ఐ.ఆర్ ఇచ్చినా అమలులో మోసం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి ఏప్రిల్ 2020 నుండి ఎగ్గొట్టి జులై 2020 నుండి అమలు చేసారు. ఏమైనా పిఆర్‌సి సంబంధించిన నికర లాభం...ఫిట్‌మెంట్ మరియు పిఆర్‌సి అమలు తేదీనిబట్టి వుంటుంది. పిఆర్‌సి కమిటీ వేసి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. కమిటీ గడువు 6 సార్లు పెంచారు. కమిటి రిపోర్టు ఇచ్చి 6 నెలలు గడిచాయి. పిఆర్‌సి నివేదిక ఒక పబ్లిక్ డాక్యుమెంట్. ప్రభుత్వం నేటికీ పిఆర్‌సి నివేదికను బయట పెట్టలేదు. నివేదికను గోప్యంగా వుంచి అధ్యయనానికి మరో కమిటీ వేసి కాలయాపన చేయడంతో ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు.
3 డి.ఎ లు-30 నెలలు తర్వాత చెల్లింపు
కరోనా సంక్షోభం పేరుతో కేంద్రం బాటలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 2020, జులై 2020, జనవరి 2021 డి.ఎ బకాయిలు రద్దు చేయడం వలన ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జులై 2018, జులై 2019 మూడు పాత డి.ఎ లు ప్రతి డి.ఎ 30 నెలల తర్వాత జీతంలో కలిపేటట్లు 2022 వరకూ సాగదీసి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం అన్యాయం. ఇది ఉద్యోగుల డి.ఎ ల చరిత్రలో ఎన్నడూ లేని దుష్ట సాంప్రదాయం. ఒకవైపు ధరలు రెట్టింపు పెరిగిన కాలంలో ఈ డి.ఎ లను రద్దు చేయడం ఉద్యోగులు, పెన్షనర్లు ఒక హక్కును కోల్పోవడమే. వారి నిజ వేతనాలు పతనం కావడమే.
హామీలు ఏమైనాయి ?
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నాటి హామీలను అమలు చేయకపోగా ఉద్యోగులకు రావాల్సిన హక్కులు, రాయితీలకు ఎగనామం పెట్టే విధానంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తుంది. ఈ నేపథ్యంలో 11వ వేతన సంఘం సిఫార్సులు ఎప్పుడు అమలయ్యేది అంతుబట్టక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పిఆర్‌సిలు, ఫిట్‌మెంట్‌లు, అమలు తేదీ, ఇతర రాయితీలను ... తెలుగు రాష్ట్రాలలో ఎవరికి మేలు జరిగితే...వాటితో పోల్చుకొని అడగడం, పోరాడటం జరుగుతున్నది. నష్టం జరిగితే నివారణకు పోరాడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్‌సి కమిటీ రిపోర్టు బయట పెట్టాలని, 55 శాతం ఫిట్‌మెంట్‌తో, జులై 2018 నుండి ఆర్థిక ప్రయోజనంతో తక్షణం అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే మూడవ బడ్జెట్‌లో తగు కేటాయింపులు చేయాలని పిడియఫ్ డిమాండ్ చేస్తున్నది.
/ వ్యాసకర్త యుటియఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ /
ఐ. వెంకటేశ్వరరావు










