Dec 15,2022 23:05

మాట్లాడుతున్న పెన్షనర్ల సంఘం నేత సుధాకర్‌

ప్రజాశక్తి -పిఎం పాలెం: ఇపిఎఫ్‌ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు తాత్కారం చేయడం తగదని ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొమ్మాదిలోని సంఘ కార్యాలయంలో ఎంవిఆర్‌ పాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగుల జీవనానికి సరిపడా పెన్షన్‌ ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్‌సి గుప్త కేసులో తీర్పును అందరికీ వర్తింపజేయాలన్నారు. ఈ నెల 7,8 తేదీల్లో ఢిల్లీలో విజయవంతమైన పెన్షనర్ల ధర్నాకు ఎనిమిది మంది ఎంపీలు మద్దతునిచ్చారన్నారు.
సంఘం విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డిపిల్లి బాబూరావు మాట్లాడుతూ ఇపిఎఫ్‌ పెన్షన్‌దారులకు కనీస పింఛను నెలసరి రూ. తొమ్మిది వేలు చెల్లించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కరువుభత్యాన్ని పెంచాలని కోరారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిసిసి రిటైర్‌ ఉద్యోగి, సీనియర్‌ నాయకుడు భానుప్రకాష్‌ను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్‌.నాగేంద్ర, ప్రసాద్‌, ఎ. అప్పారావు, భవానీశంకర్‌ పాల్గొన్నారు.