
ప్రజాశక్తి-అనకాపల్లి
దేశవ్యాప్తంగా 77 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్స్ తమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు సభ్యులకు వినతి పత్రాలు ఇచ్చి, స్టీలు పల్లాలు మోగించి నిరసన, భిక్షాటన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బివి సత్యవతికి ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. పెన్షన్ 9 వేల రూపాయలకు పెంచాలని, హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ అనుమతించాలని కోరారు. 35 లక్షల మందికి కేవలం 1000 రూపాయలు పింఛన్ మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలు పని చేసి రిటైర్ అయిన వారు ఎటువంటి ఆదరణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వృద్ధాప్యంలో అనారోగ్యానికి మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో తెలియజేయాలని కోరారు. అనంతరం ఎంపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే దీనబంధు, తేలయ్య బాబు, విత్తనాల పోతురాజు, కే అప్పలరాజు, బలిరెడ్డి సత్యనారాయణ, కే పైడిరాజు నమ్మి అప్పలనాయుడు, పి గురునాథరావు, బి గురప్ప, కెపి కుమార్ తదితరులు పాల్గొన్నారు.