ప్రజాశక్తి- కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకుగాను ప్రత్యేకంగా రూపొందించబడిన ఉద్యోగుల సమస్యల పరిష్కార పోర్టల్‌ను సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు ఎంప్లారు గ్రీవెన్స్ పోర్టల్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికై ఉపయోగించుకోవాలని కోరారు. ఈ పోర్టల్ ద్వారా ఎపిఇపిడిసిఎల్ పరిధిలోని 11 జిల్లాల ఉద్యోగులు తమ ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సంస్థ హెచ్‌ఆర్‌డి విభాగంలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఉద్యోగి సమస్యను నమోదుచేసుకొన్న వెంటనే ఆ ఉద్యోగి పోర్టల్‌లో నమోదు చేసిన మొబైల్ ఫోన్‌కి ఒక సంక్షిప్త సందేశం వస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు నమోదు చేసుకొన్న సమస్యలను కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి సత్వర పరిష్కారానికై ఆదేశాలు జారీ చేస్తారని, సమస్య పరిష్కారం అయిన వెంటనే ఉద్యోగికి సమస్య పరిష్కారమైనట్లు కూడా మరొక సంక్షిప్త సందేశం వస్తుందని వివరించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఉత్తర్వులు పోర్టల్ ద్వారా పొందవచ్చన్నారు. ఈ పోర్టల్‌ను రూపొందించిన మానవ వనరులు, ఐటి విభాగాలను సిఎండి అభినందించారు. కార్యక్రమంలో సిజిఎంలు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.










